
రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం
హైదరాబాద్: అసెంబ్లీ మెయిన్‌గేటు వద్ద శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని చీఫ్ మార్షల్ కమలాకర్ అడ్డుకోవడం వివాదాస్పదమైంది. స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీ లాబీల్లోకి వెళుతున్న రేవంత్‌ను కమలాకర్, ఇతర పోలీసులు అడ్డుకోగా తమను అసెంబ్లీ వ్యవహారాల వరకే సస్పెన్షన్ చేశారు తప్ప గేటులోకి రాకుండా కాదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధనల మేరకు అడ్డుకున్నారో లిఖితపూర్వకంగా రాసివ్వాలని చీఫ్ మార్షల్‌ను డిమాండ్ చేశారు.
రేవంత్‌తో చీఫ్ మార్షల్ గొడవ పడుతున్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అధికారుల వైఖరిని తప్పుబట్టారు. ‘స్పీకర్ మౌఖిక ఆదేశాల మేరకే ఈ పని చేస్తున్నాను. మీరు వెళ్లాలనుకుంటే మీ ఇష్టం’అని చీఫ్‌మార్షల్ పక్కకు తప్పుకున్నారు. ‘బాజాప్తా వెళ్తాం. అది మా హక్కు. పైరవీకారులు, ఎమ్మెల్యేలు కాని వారు అసెంబ్లీ లాబీల్లోకి పాస్‌లతో వస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులను అడ్డుకుంటారా?’ అంటూ లోపలకు వెళ్లి స్పీకర్‌ను కలిశారు. చీఫ్ మార్షల్ ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ ఆవరణలో ఫ్లెక్సీ పట్టుకోవడంపైనా వివాదం
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లే ముందు అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద నిలబడిన ఎమ్మెల్యేలు ‘గవర్నర్ గారూ... ఎమ్మేల్యేల గోడు వినండి - నియంతృత్వ ప్రభుత్వాన్ని నిలువరించండి..ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని రాసిన ఫ్లెక్సీని ప్రదర్శించడం పట్ల చీఫ్ మార్షల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీని ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో వాదనకు దిగారు. ‘మేమేమైనా సభలో ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్నామా? అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేలు నిలబడి బ్యానర్‌లు కూడా ప్రదర్శించకూడదా? అని ఎర్రబెల్లి నిలదీశారు. అయినా ఫ్లెక్సీని ప్రదర్శించడానికి వీల్లేదంటూ చీఫ్ మార్షల్ గొడవకు దిగడంతో డీసీపీ కమలాకర్‌రెడ్డి సర్దిచెప్పి పంపించారు.