
హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ శనివారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చర్చ జరగకుండానే ఆమోదించడాన్ని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఖండించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడం వల్ల భవిష్యత్‌లో బీసీ రిజర్వేషన్లు శాశ్వతంగా తగ్గిపో యే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం విద్యానగర్ లో జరిగిన వివిధ బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే బీసీ రిజర్వేషన్లు తగ్గించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెబుతున్నారని, సుప్రీం తీర్పును అధిగమించడానికి ప్రభు త్వాలకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలసి తద్వారా రాష్ట్రపతితో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకురావచ్చని తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రముఖ న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. త్వరలో 112 బీసీ కుల సంఘాలతో ప్రధాని, రాష్ట్రపతిని కలసి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment