సిర్పూర్(టి) – మెట్టందాని వరకు రహదారి నిర్మాణం కోసం జూలై 2న శంకుస్థాపన చేస్తున్న మంత్రి రామన్న, చిత్రంలో ఎంపీ నగేశ్ తదితరులు
సాక్షి, ఆదిలాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటి కోసం ఉమ్మడి జిల్లా నుంచి పంపించిన ప్రతిపాదనలకు మంజూరు లభిస్తే మహారాష్ట్రకు సరిహద్దు గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు మహర్దశ కలగనుంది. రోడ్డు సదుపాయం ఏర్పడి ఆయా గ్రామాలకు వివిధ సౌకర్యాలు మెరుగుపడతాయి. తాజాగా భద్రాద్రి జిల్లాకు నిధులు మంజూరు కావడం గమనార్హం. మన జిల్లాల నుంచి పంపించిన ప్రతిపాదనలకు కేంద్రం నుంచి ఆమోదం లభించిన పక్షంలో అనేక గ్రామాలకు వంతెనలు, రోడ్లు నిర్మించే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం నిధులు..
లెఫ్ట్ వింగ్ ఎక్సిట్రిమిజం (ఎల్‌డబ్ల్యూఈ) కింద రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇంటిలిజెన్స్ నివేదిక ఆధారంగా ఆయా ప్రాంతాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఎంపిక చేస్తుంది. దాని ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నిధులు మంజూరు అవుతాయి. ఇంటెలిజెన్స్ సూచించిన చోటనే సరిహద్దు, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణాలు చేపడుతారు. రహదారులు, భవనాల శాఖ ఈ పనులను పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటుంది. జిల్లాల విభజన తర్వాత 2017–18 సంవత్సరం కోసం మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకు ఎల్‌డబ్ల్యూఈ కింద ఎంపిక చేయడం జరిగింది. రూ.153 కోట్లు మంజూరయ్యాయి. తాజాగా వాటికి సంబంధించి ఇటీవలే పలు పనులకు శంకుస్థాపన కూడా పూర్తయింది. ప్రాణహిత సరిహద్దులో ఈ పనులను చేపడుతున్నారు. రెండు జిల్లాల్లో నాలుగు బ్రిడ్జిలు, ఏడు రోడ్లు నిర్మిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కూడా..
ఎల్‌డబ్ల్యూఈ మొదటి విడతలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఉండగా, అందులో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలనే పరిగణలోకి తీసుకునేవారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాగా చూస్తే ప్రస్తుతం కొత్త జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి జిల్లా మాత్రమే ఉండేదని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల విభజన తర్వాత రెండో విడతలో మంచిర్యాల, కుమురంభీం జిల్లాలను తీసుకోవడం జరిగిందని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాను మొదట్లో పరిగణలోకి తీసుకోలేదు. కాగా ఇటీవల జిల్లాలో ఆదివాసీ ఉద్యమం విస్తృతంగా సాగుతుండటం, అదే సమయంలో మారుమూల గిరిజన గ్రామాలకు ఇప్పటికి సరైన రోడ్డు సంబంధాలు లేకపోవడాన్ని పోలీసు శాఖతో పాటు ఇంటిలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది.
ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ మండలాల్లో సరైన రోడ్డు మార్గాలు లేక దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. కల్వర్టులు, బ్రిడ్జిలు లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల నార్నూర్‌లో వంతెన లేని కారణంగా వరద ప్రవాహంలో గర్భిణిని ప్రసవానికి తరలించడంలో ఆటంకాలు ఎదురయ్యాయి. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో గర్భిణి అక్కడే ప్రసవించడం, శిశువు మృతిచెందడం సంఘటన జిల్లా పరిస్థితికి అద్దం పట్టింది. ఈ నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు 22 పాయింట్లలో రోడ్డు కనెక్టివిటి పెంచాలని సూచిస్తూ నివేదిక పంపడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాను కూడా ఎల్‌డబ్ల్యూఈ కింద ఎంపిక చేయడంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
మూడు జిల్లాలకు రూ.900 కోట్లు..
ఎల్‌డబ్ల్యూఈ రెండో విడతలో మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాలకు కలిపి 2018–19 కోసం రూ.900 కోట్లతో మూడు నెలల కిందట ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇందులో ఆదిలాబాద్ జిల్లాకు రూ.250 కోట్లతో, మిగతా మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలోంచి ఎన్నింటికి మోక్షం కలుగుతుందో, ఎన్ని నిధులు మంజూరవుతాయో వేచి చూడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
ఒకవేళ పంపిన ప్రతిపాదన ఆధారంగా నిధులు మంజూరైన పక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మారుమూల, సరిహద్దు గ్రామాల్లో రోడ్డు కనెక్టివిటి పెరిగి ప్రజా సంబంధాలు పెంపొందుతాయని చెబుతున్నారు. సరైన మార్గం లేకపోవడం, గిరిజన గ్రామాల్లో తాత్కాళిక కల్వర్టులు, వంతెనలు ఏర్పాటు చేసుకొని రాకపోకలు సాగించడం కనిపిస్తుంది. వరద ప్రవాహం కారణంగా అవి కొట్టుకుపోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment