ఇందూరు కలెక్టర్ రొనాల్డ్ రాస్ | Ronald ross appointed as induru collector | Sakshi
Sakshi News home page

ఇందూరు కలెక్టర్ రొనాల్డ్ రాస్

Published Thu, Jul 31 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

ఇందూరు కలెక్టర్ రొనాల్డ్ రాస్

ఇందూరు కలెక్టర్ రొనాల్డ్ రాస్

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లాకు కలెక్టర్‌ను నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్ ఇక్కడికి కలెక్టర్‌గా బదిలీపై వస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ బుధవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు.

గత కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న బదిలీ అయిన 43 రోజులకు జిల్లాకు కొత్త కలెక్టర్ నియామకమైంది. ఇంతకాలం ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ డి. వెంకటేశ్వర్‌రావు కూడ బదిలీ అయ్యారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోగా, ఆయన స్థానంలో కూడ ఇంకా ఎవరినీ నియమించ లేదు. పీఎస్ ప్రద్యుమ్నను జూన్ 17న ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే.
 
 ఆయనతో పాటు అదేరోజు ఐఏఎస్ అధికారి, బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌ను కూడ బదిలీ చేసింది. అయితే బోధన్‌కు కరీంనగర్‌లో ఆర్వీఎం పీవోగా పనిచేస్తున్న జి.శ్యాంప్రసాద్‌లాల్‌ను ఆర్డీవోగా ఆ మరుసటి రోజే నియమించింది. కలెక్టర్ నియామకంలో మాత్రం జాప్యం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రొనాల్డ్‌రాస్ మద్రాసు యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశారు. 1980 జూన్ 24న జన్మించిన ఈయన మద్రాసు యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తూ 2006లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2006 నుంచి 2007 వరకు ట్రైనింగ్ పూర్తి చేసిన రాస్‌కు 2007 జూలై 22న అసిస్టెంట్ కలెక్టర్‌గా ల్యాండ్ రెవెన్యూ హైదరాబాద్ కార్యాలయంలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు.
 
 అసిస్టెంట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్ హోదాలలో అదే కార్యాలయంలో పనిచేసిన ఆయన 2008 సెప్టెంబర్‌లో నర్సాపూర్ సబ్‌కలెక్టర్‌గా నియమితులు కాగా అక్కడ 2010 వరకు పని చేశారు. 2010 ఫిబ్రవరి 19న రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నియమితులైన రొనాల్డ్‌రాస్ 2011 ఆగస్టు 19 వరకు అక్కడే విధులు నిర్వహించారు. 2011 ఆగస్టు 20న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో అడిషనల్ సీఈవోగా పనిచేశారు. 2012 సెప్టెంబర్11న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌లో అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
 
 సుమారు రెండు సంవత్సరాల పాటు జీహెచ్‌ఎంసీలో వివిధ  జోన్లలో పనిచేసిన ఆయన సిటీ ప్లానింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరించారు. విధుల్లో ముక్కుసూటిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరున్న రొనాల్డ్‌రాస్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారిగా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారన్న పేరుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement