‘ఎక్సైజ్’కు కాసుల పంట
- లెసైన్స్‌ల ద్వారా ఏడాదికి రూ.52.75 కోట్లు
- దరఖాస్తుల అమ్మకాలపై రూ.9.52 కోట్లు
- మద్యం విక్రయాలపై వెయ్యికోట్లకు పైగానే...
ఖమ్మంక్రైం: ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండింది. జిల్లాలోని వైన్ షాపులను సోమవారం లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. అటు దరఖాస్తుల అమ్మకం, ఇటు షాపుల కేటాయింపు ద్వారా ఎక్సైజ్ శాఖ భారీస్థాయిలో ఆర్జించింది. ఈనెల 15 నుంచి 21 వరకు జిల్లాలోని మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో మొత్తం 147 షాపులు ఉండగా వీఎం బంజరలో రెండు, గుండాలలో ఒకటి, పెనగడపలో రెండు దుకాణాలకు మినహా 142 షాపులకు3,837 దరఖాస్తులు వచ్చాయి.
వీటి చలానాల ద్వారా రూ.9,59,25 వేల ఆదాయం లభించింది. ఖమ్మంలోని న్యూబగ్గా వైన్‌షాపునకు, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి వద్ద గల పల్లెగూడెం షాపునకు అత్యధికంగా 111 దరఖాస్తులు వచ్చాయి. కేవలం ఈ రెండు షాపుల దరఖాస్తుల అమ్మకం ద్వారానే రూ.55.50 లక్షల ఆదాయం సమకూరింది. ఖమ్మం నగరంలోని షాపులకు వ్యాపారులు ఎక్కువగా పోటీపడ్డారు. ఏజన్సీ ప్రాంతంలోని షాపులకంటే కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్న షాపులపైనే వ్యాపారులు దృష్టి కేంద్రీకరించారు.
తొలివిడతలో 17 కోట్లు..
డ్రాలో గెలుపొందిన వ్యాపారి మొదటిసారిగా 33.33 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తొలి విడతగా 142 మంది వ్యాపారులు చెల్లించిన మొత్తం రూ.17.03 కోట్లకు చేరింది. ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న 18 షాపులకు రూ.42 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 10వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న 32 షాపులకు రూ.34 లక్షలు, 10వేల లోపు జనాభా ఉన్న 24 షాపులకు రూ.32.50 లక్షలు, కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 50 వేల నుంచి 3 లక్షల వరకు జనాభా ఉన్న 26 షాపులు రూ.42 లక్షలు, 10వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న 19 షాపులు రూ.34లక్షలు, 10వేల లోపు జనాభా ఉన్న 23 షాపులు రూ.32.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని మూడు షాపులకు, కొత్తగూడెం సూపరింటెండెంట్ పరిధిలోని రెండు షాపులకు దరఖాస్తులు రాలేదు. మిగితా దరఖాస్తుల చలానాల ద్వారా రూ.9,59,25 వేలు, లెసైన్స్ ఫీజుల ద్వారా రూ.17.03 కోట్లు.. మొత్తం రూ.26,63,25 వేల ఆదాయం ఆబ్కారీ శాఖకు లభించింది.
147 షాపులకు రూ.52.75 కోట్ల ఆదాయం...
ప్రతి నాలుగు నెలలకు ఒకసారి షాపులో 1/3 వంతు లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటి ద్వారా సంవత్సరం మొత్తంలో 147 షాపుల ద్వారా రూ.52.75 కోట్ల ఆదాయం ఆబ్కారీ శాఖకు లభించనుంది. ఇప్పటికే మొదటి విడత ఆదాయం రూ.17.03 కోట్లు వచ్చింది. మరో రూ.35.72 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కాగా, పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడంతో ఆ మండలాల్లో ఉన్న తొమ్మిది షాపులు ఆ రాష్ట్రానికి వెళ్లిపోయాయి. వీటి స్థానంలో జిల్లాలో మరో తొమ్మిది కొత్త షాపులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం షాపుల సంఖ్య 156కు చేరుతుంది. ఈ అన్ని షాపులలో మద్యం విక్రయాల ద్వారా జిల్లా ఎక్సైజ్ శాఖకు ఏడాదికి సుమారు వెయ్యికోట్లకు పైగానే ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.