మద్యం..@ ఆదాయం
ఒంగోలు టౌన్ : జిల్లాలో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది రూ.120 కోట్ల ఆదాయం సమకూరనుంది. శుక్రవారంతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. శనివారం లాటరీ ద్వారా లెసైన్స్‌దారులను ఎంపిక చేశారు. లాటరీని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 321 మద్యం షాపులున్నాయి. వాటిలో 276 షాపులకు మాత్రమే టెండర్లు వేశారు. మొత్తం మీద 2014-15 సంవత్సరానికిగాను ఎక్సైజ్ శాఖకు
మొత్తం రూ. 120 కోట్ల మేర ఆదాయం రానుంది.
276 షాపులకు 6,194 టెండర్లు దాఖలయ్యాయి. టెండర్ ఫారాల ద్వారా 15.38 కోట్ల ఆదాయం వచ్చింది. 45 షాపులకు ఒక టెండర్ కూడా దాఖలు కాలేదు. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం మద్యం దుకాణానికి జిల్లాలోనే అత్యధికంగా 300 టెండర్లు దాఖలయ్యాయి. మొత్తం 42 మద్యం షాపులకు సింగిల్ టెండర్లు మాత్రమే వచ్చాయి. మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ విధానం ద్వారా మద్యం షాపులు కేటాయిస్తామని అధికారులు ప్రకటించినా టెండర్‌దారులకు టోకెన్లు ఇచ్చే ప్రక్రియ వద్ద ఇబ్బందులు తలెత్తడంతో 2 గంటలు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.దేవకుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌వీఎస్ ప్రసాద్, ఒంగోలు, మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఎం.భాస్కరరావు, ఆర్.కిషన్, ఏఈఎస్ చంద్రశేఖరరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ ఆనాల ఆవులయ్యతో పాటు జిల్లాలోని 14 సర్కిళ్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఆ మద్యం షాపు రూటే సప‘రేటు’
చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం మద్యం షాపునకు గుర్తింపు వచ్చింది. మద్యం షాపుల కేటాయింపులో భాగంగా వాటిని మూడు రకాలుగా విభజించారు. 5 వేల లోపు జనాభా ఉన్న మర్రిచెట్లపాలెం షాపునకు లెసైన్సు ఫీజు కింద ఏడాదికి రూ.32.50 లక్షలు కేటాయించారు. 300 మంది ఈ ఒక్క షాపుకే టెండర్లు వేయటంతో ఎక్సైజ్ శాఖకు రూ.75 లక్షల ఆదాయం సమకూరినట్లయింది. ఒక్కో టెండర్‌కు రూ.25 వేలు చొప్పున చెల్లించారు. లాటరీ పద్ధతి ద్వారా కలెక్టర్ సీలు తీసినప్పుడు ఆ 300 మందిలో నిప్పట్లపాడు గ్రామానికి చెందిన మువ్వా మాలకొండరాయుడును అదృష్టం వరించింది.