చంపాపేట: కార్మికుల సంక్షేమం కోసం సంఘాలు, యూనియన్‌ల ఏర్పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కని, వాటిని కాలరాయాలని చూస్తే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. చంపాపేట డివిజన్ పరిధిలోని చంద్రాగార్డెన్‌లో మంగళవారం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతి ఏర్పాటు చేసిన కేంద్రకమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవిధానం మానుకోక పోతే మళ్ళీ ఆందోళన బాట పట్టక తప్పదన్నారు. బస్సుల సంఖ్యను కుదించటం వల్ల కార్మికులు డ్యూటీల కోసం బస్‌డిపోల ముందు పడిగాపులు కాయటమే కాకుండా ఓవర్‌లోడ్ ప్యాసింజర్‌తో కార్మికులు పని ఒత్తిడికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బస్ డిపోలో విధినిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలపై అవగాహన లేని వ్యక్తులను కార్మిక సంక్షేమ సభ్యులుగా నియమించటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment