- 2,034 మంది బకాయిదారులు
- ఆరు నెలల గడువు
- మూడు కేటగిరీలుగా ఫీజు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: సీనరేజి బకాయిల వసూలుకు ప్రభుత్వం వన్ టైం సెటిల్‌మెంట్ ప్రకటిం చింది. నిర్మాణ రంగానికి అవసరమైన భూగర్భ ఖనిజవనరుల అక్రమ వినియోగంపై భారీ జరిమానాలకు బదులుగా ఈ విధానం అమలు చేయనుంది. దీంతో ప్రభుత్వానికి దాదాపు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. ఆరు నెలల పాటు అమల్లో ఉండే వన్ టైం సెటిల్‌మెంట్‌ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
1996 ఏపీ మైనర్ మినరల్ కన్‌సెషన్ చట్టం ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఇసుక, మొరం, రాయి, కంకర, గ్రానైట్, సున్నపురాయి, బిల్డింగ్ స్టోన్.. ఖనిజ వనరుల తవ్వకాలు, అక్రమ రవాణా చేస్తే జరిమానా తప్పదు. అదే నిబంధనల ప్రకారం అడ్డదారిలో వాటిని వినియోగించుకున్న బాధ్యులు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు తనిఖీలు చేపట్టినప్పుడు.. వాటికి సంబంధించిన సీనరేజి ఫీజురశీదులు చూపించటం తప్పనిసరి. లేకుంటే సీనరేజితో పాటు.. అంతకు మించి అయిదు రెట్ల వరకు జరిమానా విధిస్తారు.
చాలాచోట్ల కాంట్రాక్టర్లు నిర్మించిన భవనాలున్నాయి.. కానీ, అసలు యజమానుల వద్ద సీనరేజి చెల్లించినట్లు ఆధారాలేమీ లేవు. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ వింగ్ తనిఖీల్లో ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రైవేటు బిల్డర్లు, కాంట్రాక్టర్లకు సంబంధించి విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ విభాగం పరిధిలో ఇటువంటివి 2034 కేసులు నమోదయ్యాయి.
కేవలం 546 కేసులు కోర్టుల దాకా వెళ్లటంతో అప్పీళ్ల స్థాయిలో ఉన్నాయి. మిగతా పెండింగ్ కేసులు ఏకంగా రెవిన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే స్థాయికి చేరుకున్నాయి. మధ్యేమార్గంగా ఈ కేసులన్నింటికీ వన్ టైం సెటిల్‌మెంట్ అవకాశం కల్పిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మొదటి కేటగిరీలో సొంత గృహ నిర్మాణాలు, రెండో కేటగిరీలో చిన్న వ్యాపార వాణిజ్య సముదాయాలు (5000 చదరపు అడుగుల లోపు), అంతకు మించిన విస్తీర్ణంలో ఉన్న వాణిజ్య సముదాయాలను మూడో కేటగిరీలో చేర్చారు. వన్ టైం సెటిల్‌మెంట్ ప్రకారం మొదటి కేటగిరీకి చెందిన బకాయిదారులు సీనరే జి ఫీజు చెల్లించాలి. రెండో కేటగిరీలో సీనరేజితో పాటు అంతే మొత్తం జరిమానా, మూడో కేటగిరీకి చెందిన వారైతే సీనరేజిపై రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకుంటే స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు.