కీలక పోస్టులుఖాళీ...
- జెడ్పీ సీఈఓ పోస్టు సహా భర్తీకాని 12 స్థానాలు
- కొన్ని నెలలుగా ఇన్‌చార్‌జలతోనే పాలన
- ఒకే అధికారి రెండు మూడు పోస్టుల్లో విధులు
- మందగిస్తున్న అభివృద్ధి పనులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ఎన్నో ఆశలతో పాలన మొదలైంది.. నూతన పథకాలు ప్రారంభమతున్నాయి.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేది, పథకాలను అమలు చేసేది అధికార యంత్రాంగమే.. జిల్లా స్థాయి అధికారుల పాత్ర దీంట్లో కీలకంగా ఉంటుంది. వీరే, ఆయా శాఖల సిబ్బందిని పరిపాలన పరంగా ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అయితే పలు శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో పరిపాలనపై ప్రభావం పడుతోంది.
ఇన్‌చార్‌జ అధికారులతో నెట్టుకురావాల్సి వస్తోంది. ఒకే అధికారి రెండు మూడు పోస్టుల్లో విధులు నిర్వర్తించాల్సి రావడంతో దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’ కార్యక్రమం అమలు మందగిస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికల రూపకల్పన బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లకు అప్పగించింది.
జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ప్రణాళిక తయారీ బాధ్యతలను చూడాలి. ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లాలో పూర్తి స్థాయి అధికారి లేరు. జిల్లా పరిషత్ సీఈఓ పోస్టు నెల రోజుల క్రితమే ఖాళీ అయింది. జిల్లా నీటి నిర్వహణ సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టరు వి.వెంకటేశ్వర్లుకు జిల్లా పరిషత్ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా ఒకే అధికారి రెండు కీలకమైన పోస్టుల్లో ఉండడంతో విధుల నిర్వహణ సాఫీగా సాగడం లేదు.
మన ఊరు... మన ప్రణాళికకు సంబంధించి కూడా ముందుగా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో ఈ పని చేయకపోవడంతో కొత్త కార్యక్రమం స్ఫూర్తి పూర్తిగా నెరవేరలేదు. గతంలో లాగే ఎక్కువ మంది ప్రజలు మళ్లీ రేషన్‌కార్డులకు, సామాజిక పించన్లకు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎక్కువ గ్రామాల్లో ప్రణాళిక రూపలక్పన అంశం రెండో ప్రాధాన్యంగా జరిగింది.
ప్రాథమిక విద్యకు సంబంధించి కీలకమైన రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి పోస్టు ఖాళీగా ఉంది. దీనికి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను అదనపు జాయింట్ కలెక్టర్ నిర్వహిస్తారు. ఇప్పుడు ఆర్‌వీఎం ప్రాజెక్టు అధికారి బాధ్యతలు అదనంగా చూడాల్సి వస్తోంది.
సహకార శాఖను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో జిల్లా సహకార శాఖ అధికారి(డీసీవో) పోస్టు ఖాళీగా ఉంది. డివిజన్ స్థాయి సహకార అధికారి సంజీవరెడ్డి డీసీవో పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దళితుల సంక్షేమానికి సంబంధించి కీలకమైన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పోస్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులో సైతం ఇంచార్జీ అధికారే ఉన్నారు.
రెవెన్యూకు సంబంధించి పట్టణంలో కీలకమైన అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేక అధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేసే అధికారి రెవెన్యూ మంత్రి పేషీలో చేరి రెండు నెలలు గడుస్తున్నా కొత్తగా ఏ అధికారినీ నియమించ లేదు. ఏటూరునాగారంలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ పోస్టు నెలల క్రితమే ఖాళీ అయింది. ములుగు రెవెన్యూ డివి జనల్ అధికారి మోతీలాల్‌కు ఈ పోస్టును అదనపు బాధ్యతల కింద అప్పగించారు.
శాఖకు సంబంధించి జిల్లాలోని డిప్యూటీ డెరైక్టరు పోస్టు ఖాళీగానే ఉంది. ఈ శాఖ అసిస్టెంట్ డెరైక్టరు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ పథకాలై అమలుపై అధికార యంత్రాంగానికి ప్రజలకు సంధానకర్తగా వ్యవహరించే సమాచార శాఖలోనూ ఖాళీలు ఉన్నా యి. జిల్లా ప్రజాసంబంధాల అధికారి పోస్టులో దాదాపు రెండు నెలలుగా ఇంచార్జీ అధికారే ఉన్నారు.
తాజాగా... గురువారం పౌరసరఫరాల శాఖ జిల్లా మేనే జరు ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో నల్లగొండ జిల్లా జోనల్ మేనేజర్ రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి(సీఈవో) ఖాళీగా ఉంది. సీఈఓగా పనిచేసిన ఆంజనేయులు నెల క్రితం ఉద్యోగ విరమణ పొందగా.. జిల్లా నీటి నిర్వహణ సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ వి.వెంకటేశ్వర్లుకు జెడ్పీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య నిర్వర్తిస్తున్న ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లాకు పూర్తి స్థాయి అధికారి లేరు. ఈ పోస్టులో ఉన్న పి.సాంబశివరావును కొన్ని రోజుల క్రితం రీజినల్ డెరైక్టర్‌గా నియమించారు. తాజాగా ఆయన గురువారం వైద్య శాఖ రాష్ట్ర అదనపు డెరైక్టర్‌గా నియమితుల య్యారు. ఆయనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌చార్‌జ అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు.
వ్యవసాయూనికి కీలక తరుణమిది. పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖకు జిల్లాలో పూర్తి స్థాయి అధికారి లేరు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి(జేడీఏ) పోస్టులో కింది స్థాయి అధికారి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.