
వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతంలో ఆదివారం బుర్రి ప్రసాద్ (28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గల్లంతయ్యాడు. సహాయక సిబ్బంది అతడి కోసం గాలించినప్పటికీ సాయంత్రం వరకూ ఆచూకీ లభించలేదు. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం రామవాడకు చెందిన ప్రసాద్ కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
బొగత జలపాతాన్ని సందర్శించడానికి స్నేహితులు మినుగు అనిల్, వేముల వినయ్, రావుల నిఖిల్ తో కలసి ఇక్కడికి వచ్చారు. ప్రసాద్ జలపాతం కింది భాగం లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంత య్యాడు. సహాయక సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. సోమవారం కూడా గాలింపు చేపడతామని ఎస్సై చెప్పారు. కాగా, జలపాతంలో గల్లంతైన ప్రసాద్ కోసం గాలిస్తున్న సమయంలోనే హన్మ కొండకు చెందిన ఎస్‌వీ రెడ్డి అనే వ్యక్తి బొగతలో వస్తున్న వరదలో పడిపోయాడు. అతను నీటిలో మునిగిపోతుండగా సహాయక సిబ్బంది అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.