‘మన ప్లాన్లు’ సిద్ధం చేయండి!
ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని నియమించి వారి ద్వారా గ్రామసభలు నిర్వహించి ‘మన ప్రణాళికలు’ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికలు
ప్రతి గ్రామానికీ ఓ అధికారి నియామకం
కలెక్టర్లకు సహాయంగా ప్రతి జిల్లాకో ఐఏఎస్
ప్రణాళికల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన
తెలంగాణ నవ నిర్మాణ ప్రణాళిక వర్క్‌షాప్‌లో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని నియమించి వారి ద్వారా గ్రామసభలు నిర్వహించి ‘మన ప్రణాళికలు’ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 12 నుంచి 27 వరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెల 12 నుంచి 17 వరకు గ్రామ స్థాయి ప్రణాళికలు, 17 నుంచి 22 వరకు మండల స్థాయి ప్రణాళికలు, 22 నుంచి 27 వరకు జిల్లా స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రతి జిల్లాలో సగటున వెయ్యి గ్రామాలు ఉన్నందున జిల్లా కలెక్టర్లు వెయ్యి మంది అధికారులను గుర్తించి ప్రణాళికల తయారీ కోసం గ్రామాలకు కేటాయించాలన్నారు. ఈ ప్రణాళికల తయారీలో కలెక్టర్లకు సహకరించేందుకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప్రణాళికలు సిద్ధమైన తర్వాత ఆగస్టు ఒకటి నుంచి 10 వరకు రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించి రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికల ఆధారంగా ఆగస్టు 10 నుంచి 20 వరకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేస్తామన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సోమవారం జరిగిన ‘తెలంగాణ నవ నిర్మాణ ప్రణాళిక వర్క్‌షాప్’ముగింపు ఉపన్యాసంలో ఆయన ఈమేరకు వెల్లడించారు.
ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేకాధికారుల ఎంపిక పూర్తిచేసి వారితో పాటే తహశీల్దార్లు, ఎంపీడీఓలకు జిల్లా కేంద్రంలో ఒక రోజు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఒకవైపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తయారుచేసిన ప్రణాళికలతో ప్రభుత్వ శాఖలు సమాంతరంగా తయారు చేసిన ప్రణాళికలను క్రోడీకరించి రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేయాలన్నారు. మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు ఈ బాధ్యతను కేసీఆర్ కట్టబెట్టారు. ప్రణాళికల తయారీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలను భాగస్వాములను చేయాలని సూచించారు. మార్పు కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా కలెక్టర్ల వ్యవస్థకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వండి
ఓ వైపు ఎక్కడికక్కడ ప్రణాళికలు తయారు చేస్తూనే మరోవైపు ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ, ఎన్‌ఐఆర్‌డీ, అపార్డ్, బ్రహ్మకుమారి సంస్థల ద్వారా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. 19 నుంచి సర్పంచ్‌లకు, 23 నుంచి మండల అధ్యక్షులకు, 27 నుంచి జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు. వచ్చే శనివారం లేదా ఆదివారం ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలకు హైదరాబాద్‌లో ఒకరోజు శిక్షణ ఉంటుందన్నారు.