
తారా చౌదరి ఇంట్లో గొడవ...ముగ్గురిపై కేసు
హైదరాబాద్:సినీ నటి తారా చౌదరి నివాసంలో గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్ ఫేజ్-3 వివేకానంద స్కూల్ సమీపంలో సినీ నటి తారాచౌదరి అలియాస్ రావిళ్ల రాజేశ్వరి నివాసముంటోంది. నివాసంతో పాటు సినిమా కార్యాలయం కూడా అక్కడ కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె నివాసంలో రామినేని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మద్యం మత్తులో తారాచౌదరిని వేధింపులకు గురి చేశాడు.
దీంతో ఆమె...గత కొద్ది రోజుల నుంచి సినిమాలో హీరో వేషం కోసం తన కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వీరమాచినేని సందీప్ అనే యువకుడిని పిలిపించింది. దీంతో సందీప్ తన స్నేహితుడు ఉదయ్, రాజేష్‌ను వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ హల్‌చల్ చేస్తున్న దుర్గాప్రసాద్‌ను సందీప్ అడ్డుకోబోయాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తన భార్యతో గొడవ పడుతుంటే మధ్యలో మీకెందుకంటూ ప్రసాద్ వారిని నెట్టివేశాడు. సందీప్ రాయితో కొట్టడంతో ప్రసాద్‌కు గాయాలయ్యాయి. గొడవ పెద్దది కావటంతో తారాచౌదరి రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వారందరినీ స్టేషన్‌కు తరలించారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్, ఉదయ్, రాజేష్‌లపై పోలీసులు ఐపీసీ 448, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.