బంద్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాయడంపై జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. ఆ లేఖను నిరసిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ శుక్రవారం చేపట్టిన బంద్‌లో పెద్దఎత్తున పా ల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన బంద్ సక్సెస్ అయిం ది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు తెల్లవారుజామునుంచే ఆర్టీసీ డి పోల ఎదుట బైఠాయించడంతో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. విద్యాసంస్థలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగర్‌కర్నూలులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
ఎమ్మెల్యే ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు బంద్ నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్చర్లలో ర్యాలీ నిర్వహించారు. జడ్చర్ల, మిడ్జిల్‌లో టీడీపీ జెండా దిమ్మెలను కూలగొట్టారు. భూత్పూరులో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిలు ర్యాలీ నిర్వహించారు. కొత్తకోట మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కల్వకుర్తిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. షాద్‌నగర్‌లో దుకాణాలు మూసివేయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
అచ్చంపేటలో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాస్తారోకో చేశారు. డిపో వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేయించారు. కొడంగల్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. మానవహారం నిర్వహించారు. బొంరాస్‌పేట మండలం దుద్యాలలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. అలంపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో కూడా బంద్ సంపూర్ణంగా జరిగింది. మహబూబ్‌నగర్‌లో బంద్ సందర్భంగాఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌లు మాట్లాడుతూ తెలంగాణ పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి దారుణమన్నారు. పాలమూరు ప్రజలకు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖ శాపంగా మారనుందని.. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.