కేసీఆర్‌పై సునీల్‌రెడ్డి ధ్వజం
మంథని, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను తండ్రిలా భావిస్తే తడిగుడ్డతో తన గొంతు కోశారని ఆ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చందుపట్ల సునీల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల నుంచి ఉద్యమంలో తనను అన్ని విధాలుగా ఉపయోగించుకుని ఇప్పుడు తీరని అన్యాయం చేశారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేయడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి జెడ్పీటీసీగా పోటీలో ఉండమని సూచించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రెండురోజుల్లో పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.