పల్లియార్డు సూపర్‌వైజర్ నోటిదురుసు
- పల్లి, పసుపు యార్డుల్లో కాంటాలు నిలిపివేసిన దడువాయిలు,హమాలీలు
- మూడున్నర గంటలపాటు రైతుల నిరీక్షణ
- క్షమాపణ చెప్పిన అధికారి
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లోని పల్లి, పసుపు యార్డులో బుధవారం సుమారు మూడున్నర గంటలపాటు కాంటాలు నిలిచిపోయాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పల్లియార్డులో పనిచేస్తున్న సూపర్‌వైజర్ సంజీవ్ ఉదయమే మద్యం సేవించి పలువురు హమాలీ కార్మికులతోపాటు దడువాయిలను దూషించాడు. దీంతో హమాలీ, దడువాయి కార్మికులు ఆ అధికారిని పల్లియార్డు నుంచి మార్చేదాకా కాంటాలు నిర్వహించమని మార్కెట్ కార్యదర్శి ఉప్పుల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు.
కాంటాలు ఆలస్యం కావడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. బస్తాల వద్ద, మార్కెట్ కార్యాలయం ఎదుట కునుకు తీస్తూ కొనుగోళ్ల కోసం నిరీక్షించారు. చివరగా రైతులంతా మూకుమ్మడిగా మార్కెట్ కార్యదర్శిని కలిసి పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సమయంలోనే మార్కెట్‌కు వచ్చిన జేడీఎం సుధాకర్ కు కూడా రైతులు మొరపెట్టుకున్నారు. సూపర్‌వైజర్ సంజీవ్‌తో జేడీఎం, కార్యదర్శి దడువాయిలు, హమాలీలకు క్షమాపణ చెప్పించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎట్టకేలకు మూడున్నర గంటల అనంతరం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
గతంలోనూ ఈ అధికారి తీరు ఇంతే..
గతంలో పలుమార్లు ఈ సూపర్‌వైజర్ ఉదయం, మధ్యాహ్నం సమయంలో మద్యం సేవిస్తూ అధికారులతో పాటు హమాలీ, గుమస్తా, దడువాయిలను సైతం నానా రకాలుగా వేధించాడు. ఇప్పటికైనా మార్కెట్ ఉన్నతాధికారులు స్పందించి సూపర్‌వైజర్‌పై చర్య తీసుకోవాలని రైతులు, హమాలీ కార్మికులు, దడువాయిలు, గుమస్తాలు, ఉద్యోగులు, రైతులు కోరుతున్నారు.