సర్వే తీరిలా.. | Survey, almost .. | Sakshi
Sakshi News home page

సర్వే తీరిలా..

Published Wed, Aug 20 2014 3:50 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

సర్వే తీరిలా.. - Sakshi

సర్వే తీరిలా..

సాక్షి, సిటీబ్యూరో/నెట్‌వర్క్: మలక్‌పేట్‌లోని ఓల్డ్‌మలక్‌పేట్, శంకర్‌నగర్, మూసారంబాగ్, అజంపుర, సైదాబాద్, అక్బర్‌బాగ్, యాకుత్‌పురా ఐఎస్‌సదన్, మాదన్నపేట్‌లోని కొన్ని కాలనీలకు ఎన్యూమరేటర్లు రాలేదు. దీంతో శంకర్‌నగర్ , శ్రీసాయినగర్, ఐఎస్‌సదన్‌లలో కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. నమూనా పత్రాలను తగులబెట్టారు.
 
శంకర్‌నగర్, ఓల్డ్‌మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో సర్వే పత్రాలు అయిపోవడంతో కిరాయి ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాల నమోదుకు ఎన్యూమరేటర్‌లు నిరాకరించారు.
 
హయత్‌నగర్ డివిజన్‌లోని శుభోదయ కాలనీకి ఎన్యూమరేటర్లు రాకపోవడంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
 
హస్తినాపురం సెంట్రల్ కాలనీకి ఎన్యూమరేటర్లు రాకపోవడంతో కాలనీవాసులు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సర్వే పుస్తకాలు తెచ్చుకుని వారే సర్వే సమాచారాన్ని అధికారులకు ఇచ్చారు.
 
మన్సూరాబాద్ డివిజన్ బండ్లగూడ రాజీవ్ స్వగృహలో 500 కుటుంబాలు నివసిస్తున్నా, అక్కడికి  ఎన్యూమరేటర్లు రాలేదు.  కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఫారాలు తెచ్చుకుని నింపి అధికారులకు అందజేశారు.
 
కొన్ని ఇళ్ళకు ఎన్యూమరేటర్లు వెళ్లలేదు. ఇంతకుముందు ఇచ్చిన చెక్‌లిస్ట్‌ల ఆధారంగానే దరఖాస్తులు నింపుకున్నారు. కనీసం ఇంటి యజమానుల సంతకాలు కూడా తీసుకోలేదు.

సర్వే హైలెట్స్..ముషీరాబాద్:
ఎన్యూమరేటర్ల కోసం జనం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. అడిక్‌మెట్, ముషీరాబాద్, కవాడిగూడ, దోమల్‌గూడ, భాగ్‌లింగంపల్లి డివిజన్ల పరిధిలో సుమారు 80 శాతం సర్వే జరిగినట్లు అధికారుల అంచనా.
 
భోలక్‌పూర్ డివిజన్‌లో సర్వే అధ్వానంగా జరిగింది. 13 మంది ఎన్యూమరేటర్లు, మరో 164 మంది సహాయ ఎన్యూమరేటర్లు సర్వే విధులకు డుమ్మా కొట్టారు. తమ వీధుల్లోకి ఎవరూ రాకపోవడంతో జనం అయోమయానికి గురయ్యారు.
 
ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ఎంపీలు నంది ఎల్లయ్య, రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్, పీసీసీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు వివరాలు నమోదు చేసుకున్నారు.
 
అంబర్‌పేట్:

అంబర్‌పేట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు డివిజన్లలో సర్వేపై అయోమయం నెలకొంది.
 
పాతనల్లకుంట మేదర్‌బస్తీలో ఎన్యూమరేటర్లు ఒకే చోట కూర్చుని సర్వే ఫారాలు నింపడంతో స్థానికులు వారి చుట్టూ గుమికూడారు. నిబంధనలకు విరుద్ధంగా వివరాలు నమోదు చేసుకున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
 
అంబర్‌పేటలోని ప్రేమ్ నగర్, పటేల్‌నగర్, చెన్నారెడ్డినగర్, బాపు నగర్, ఎంసీహెచ్‌కాలనీ తదితర ప్రాంతాలలో సాయంత్రం వరకూ సర్వే సిబ్బంది రాకపోవడంతో జనమంతా వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు.
 
బర్కత్‌పురలోని తన నివాసానికి వచ్చిన ఎన్యూమరేటర్లకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పూర్తి వివరాలను అందజేసి సర్వే పత్రంపై సంతకం చేశారు.
 
గోల్నాక డివిజన్‌లోని ఖాద్రిబాగ్‌లో సగం ఇళ్లలో సర్వే చేపట్టిన సిబ్బంది తమ దగ్గర ఉన్న సర్వే పుస్తకాలు అయిపోయాయని చెప్పి చేతులెత్తేశారు. అక్కడి కొన్ని ఇళ్లలో సర్వే చేయకుండానే వెళ్లిపోయారు.
 
అన్నపూర్ణనగర్, మారుతీ నగర్, శాంతినగర్, అంబేద్కర్‌నగర్ తదితర బస్తీలలో సర్వే జరుగలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
 
అబిడ్స్:  సుల్తాన్‌బజార్, జాంబాగ్, గౌలీగుడ, ఉస్మాన్‌గంజ్, మాలకుంట ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు రాకపోవడంతో అబిడ్స్ జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని స్థానికులు ముట్టడించారు. మంగళవారం రాత్రి అబిడ్స్‌లోని 8వ సర్కిల్ కార్యాలయం వద్ద వందలాది మంది జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీహెచ్‌ఎంసీ డౌన్‌డౌన్ అంటూ, కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ పెద్ద పెట్టున నినదించారు.
 
సర్వే సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహించిన కురుమ బస్తీ వాసులు నమూనా సర్వే ఫారాలను తగులబెట్టారు.
 
ఎన్యూమరేటర్‌తో అసభ్య ప్రవర్తన

తార్నాక : ఎన్యూమరేషన్ కోసం వెళ్లిన మహిళతో ఓ వ్యక్తి ద్వంద్వార్థాలతో మాట్లాడటంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించాడు. రామంతాపూర్‌లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన జరిగింది. తీవ్రమనస్తాపానికి గురైన బాధితురాలు ఉప్పల్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.  దీంతో మునిసిపల్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకొచ్చి విచారిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement