
సర్వే స్థానికత కోసం కాదు: కేటీఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టని సాహసోపేతమైన కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూనుకున్నదని, ఏ ఒక్కరినో లక్ష్యం చేసుకొని రాష్ర్టంలో సర్వే నిర్వహించడం లేదని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. వాస్తవ సమాచార సేకరణ కోసం మాత్రమే ఆగస్టు 19న సర్వే నిర్వహిస్తున్నామని, ఒకవర్గం మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా స్థానికత నిర్థారణ లేదా ఒక ప్రాంతం వారిని లక్ష్యం చేయడం ఉద్దేశం కాదన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లు ప్రభుత్వ పథకాల అమలుకు సమగ్ర ప్రణాళికను తయారు చేయడానికి పూర్తి సమాచారం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అసమగ్రమైన సమాచారం ఉందని, దీనిస్థానంలో వాస్తవికతతో కూడిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ సర్వే ద్వారా సేకరిస్తామన్నారు.