అసెంబ్లీలో మళ్లీ రభస | Telangana assembly has been continued between disputes leaders themselves | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో మళ్లీ రభస

Published Wed, Mar 11 2015 1:48 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

అసెంబ్లీలో మళ్లీ రభస - Sakshi

అసెంబ్లీలో మళ్లీ రభస

అసెంబ్లీలో మళ్లీ రభస. సభ్యులు విచక్షణ కోల్పోయి నోరు జారారు. మైకు విరిచి నేలకేసి కొట్టారు. పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు.

* హద్దులు దాటిన మాటలు.. అధికార, విపక్షాల పరస్పర దూషణలు
* టీఆర్‌ఎస్ సభ్యుల క్షమాపణ కోసం కాంగ్రెస్ పట్టు
* డీకే అరుణను నోర్మూసుకుని కూర్చోమన్న అధికార ఎమ్మెల్యేలు
* దాదాగిరి నడవదన్న మంత్రి కేటీఆర్
* మైకును విరిచి పోడియం వద్ద బైఠాయించిన అరుణ
* జానారెడ్డి, కేసీఆర్ జోక్యంతో వెనక్కి తగ్గిన ఇరుపక్షాలు
* సమస్యల ప్రస్తావన లేకుండానే ముగిసిన ప్రశ్నోత్తరాలు

 
 సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మళ్లీ రభస. సభ్యులు విచక్షణ కోల్పోయి నోరు జారారు. మైకు విరిచి నేలకేసి కొట్టారు. పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. నిరసనలు, నినాదాలతో సభ అట్టుడికింది. బడ్జెట్ సమావేశాల మూడో రోజైన మంగళవారం కూడా పరిస్థితి మారలేదు. అదే గందరగోళం.. దుమారం. దీంతో ప్రశ్నోత్తరాల సమయమంతా సభ్యుల గొడవతోనే గడిచిపోయింది. ఉదయం సభ సమావేశం కాగానే పరిస్థితి అదుపు తప్పింది. పదో తరగతి విద్యార్థులకు సౌర విద్యుద్దీపాల పంపిణీ అంశంపై కొందరు అడిగిన ప్రశ్నకు కొనసాగింపుగా టీఆర్‌ఎస్ సభ్యుడు గువ్వల బాలరాజు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు.
 
 సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగం సమయంలో జాతీయ గీతాలాపన జరుగుతుం డగా అమర్యాదగా ప్రవర్తించిన టీఆర్‌ఎస్ సభ్యులు సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ చెప్పారని.. అధికార సభ్యులకు మినహాయింపు ఎందుకని నిలదీశారు. అప్పటి వీడియో ఫుటేజీలను పూర్తిగా బయటపెట్టాలని పట్టుబట్టడంతో సభలో గందరగోళం మొదలైంది.
 
  దీనికి సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. జాతీయగీతాన్ని అగౌరవపరిచిన వారంతా క్షమాపణ చెప్పాల్సిందేనని, తమ వాళ్లు తప్పు చేస్తే క్షమాపణ చెబుతారని చెప్పారు. ఎప్పుడైనా వీడియో ఫుటేజీ చూపించేందుకు సిద్ధమన్నారు. దీంతో బుధవారం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వా త ఫుటేజీలను చూపిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. అయితే మంగళవారమే చూపించాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపైనే చర్యలు తీసుకున్నారన్న అపవాదు రాకుండా చూస్తే పాలకపక్షానికే మం చిదని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ హితవు పలికారు. దీనికి స్పీకర్ అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సౌర విద్యుద్దీపాల పంపిణీపై సమాధానమిచ్చేందుకు జగదీశ్‌రెడ్డి ఉపక్రమిస్తూ.. ‘చెప్పింది వినరా.. మీ అవ్వ!’ అని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి అనడంతో కొద్దిసేపు అలజడి రేగింది.
 
 కేసీఆర్, జానాల పెద్దరికం
 అనంతరం కేటీఆర్, కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ మధ్య మాటల యుద్ధం జరగడంతో సభ వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభమైన వెంటనే డీకే అరుణతో పాటు కాంగ్రెస్ సభ్యులు గీతారెడ్డి, పద్మావతి, జీవన్ రెడ్డి తదితరులు స్పీకర్ పొడియం వద్ద బైఠాయించారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారిని సముదాయించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడే సభకు వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సీఎల్పీ నేత జానారెడ్డి ఇద్దరూ కల్పించుకుని ఇరువర్గాలను చల్లార్చే ప్రయత్నం చేశారు. సీఎం కుమారుడే మహిళలను అవమానిస్తే ఏం చేయాలని అరుణ ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘ఎవరు ఏం చేశారో.. ఏం మాట్లాడాలో రికార్డులు తీయండి. తర్వాత చర్యలు తీసుకోండి’ అని స్పీకర్‌ను కోరారు. మరోవైపు ఆందోళన విరమించి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని తమ పార్టీ సభ్యులకు జానారెడ్డి సూచించారు. అయిష్టంగానైనా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన విరమించారు.
 
 అడుగు తీసి అడుగు వేస్తే ఆరోపణలా?
 సీఎం కేసీఆర్ స్పందిస్తూ జానారెడ్డి సూచనలను వంద శాతం ఆమోదిస్తున్నామన్నారు. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యను టీవీలో చూసి తాను విస్మయానికి గురయ్యానని చెప్పారు. సభకు వచ్చిన తర్వాత మంత్రిని మందలించినట్లు తెలిపారు. సభలో ఉన్నప్పుడు విపక్షాలు అసహనానికి గురి చేసినా.. జాగ్రత్తగా ఉండాలని సూచించానన్నారు. అయితే, తాను అడుగు తీసి అడుగు వేసినా.. కాంగ్రెస్ సభ్యులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. చినజీయర్ స్వామితో యాదగిరిగుట్ట ఆలయ సందర్శనకు వెళ్లినా విమర్శలు చేశారన్నారు. ఛత్తీస్‌గఢ్ వెళ్లి విద్యుత్ ఒప్పందాలు చేసుకుని వస్తే ఎంత తీసుకున్నావని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  బట్ట కాల్చి మీద వేస్తామంటే ఒప్పుకోమన్నారు. రెండువైపులా సంయమనం ఉండాలని హితవు పలికారు. ప్రధాన ప్రతిపక్షాన్ని నడిపించడంలో జానారెడ్డి చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా కేసీఆర్ కొనియాడారు. ఇప్పుడే వీడియో ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సూచన మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ విచారం వ్యక్తం చేశారు. అనంతరం ప్రశ్నోత్తరాల పర్వం ముగిసిందని ప్రకటించిన స్పీకర్.. వీడియోల వీక్షణం కోసం సభను వాయిదా వేశారు.
 
 విచారంవ్యక్తం చేసిన కేటీఆర్, ఆరుణ
 భోజన విరామ సమయం తర్వాత సభ తిరిగి సమావేశమైంది. సభలో రేగిన దుమారంపై ముందుగా ఎవరు విచారం వ్యక్తం చేయాలనే దానిపై కొంత చర్చ జరగగా.. సీఎం జోక్యం చేసుకుని ముందుగా అధికారపక్షం నుంచే చెప్పిస్తామన్నారు. దీంతో తన మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే.. వాటిని ఉపసంహరించుకుని విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. దీనిపై డీకే అరుణ స్పందిస్తూ తనను కించపరిచే వ్యాఖ్యలు, రన్నింగ్ కామెంటరీతో ఇబ్బంది కలుగుతోందన్నారు. టీఆర్‌ఎస్ సభ్యులు తనను అసభ్య పదజాలంతో దూషించారని, అందుకే తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. మైక్‌ను విరిచినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. తన వ్యాఖ్యలు అన్‌పార్లమెంటరీగా ఉంటే వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో సభలో మూడు గంటలపాటు రేగిన వివాదం సమసిపోయింది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ మొదలైంది.
 
 వీడియో పుటేజీల పరిశీలన
 అన్ని పార్టీల నేతలతో స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమై మంత్రి కేటీఆర్, డీకే అరుణ మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోలను సుమారు గంటన్నరపాటు పరిశీలించారు. మొదట డీకే అరుణ మైకు విరగ్గొట్టిన దృశ్యాలే ఉండడంతో ఆమె క్షమాపణ కోరాలని నిర్ణయించారు. మరో కెమెరా దృశ్యాలను కూడా చూడాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడంతో వాటిని కూడా స్పీకర్ పరిశీలించారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ ఇద్దరి క్షమాపణలు కోరాలని నిర్ణయించారు.
 
 అధికార దర్పంతో అదుపు తప్పారు..: జానా
 జానారెడ్డి మాట్లాడుతూ మంత్రులు, అధికార పార్టీ సభ్యుల తీరుపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఓవైపు కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుంటే మరోవైపు టీఆర్‌ఎస్ సభ్యులు అధికార దర్పంతో అదుపుతప్పి మాట్లాడుతున్నారని చురకలంటించారు. కొత్త రాష్ట్రంలో ఆదర్శ విధానంలో సభ నిర్వహణ కోసం తాను తాపత్రాయపడుతుంటే కొందరి వల్ల సాధ్యం కావడం లేదన్నారు. మంత్రి ఉద్యోగాలు తామూ చేశామని, అదంతా తమకు కొత్త కాదన్నారు. పాత వివాదానికి ముగిం పు పలికేందుకు ఆలోచిస్తుంటే, మరో వివాదం పుట్టుకొచ్చిందని వ్యాఖ్యానిం చారు. అధికారపార్టీ సభ్యులను అదుపులో పెట్టుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. గవర్నర్ ప్రసంగంతో పాటు తాజా ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించి మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 కేటీఆర్ వర్సెస్ డీకే అరుణ
గద్వాల నియోజకవర్గంలోని గుర్రం గడ్డ దీవి-రంగాపూర్ మధ్య కృష్ణా నదిపై వం తెన నిర్మించే అంశాన్ని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ లేవనెత్తగా అలాంటి ప్రతిపాదన లేదని మంత్రి తారక రామారావు పేర్కొన్నారు. ఆ సమయంలో నీటి పారుదల శాఖ మంత్రి సభలో లేరు. దీంతో మంత్రి లేనందున తన ప్రశ్నను బుధవారానికి వాయిదా వేయాలని అరుణ కోరారు. అయితే ఇరిగేషన్ శాఖ పరిధిలోని రోడ్లు, వంతెనలను రోడ్లు, భవనాల శాఖకు బదలాయించినట్టు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా అరుణ మాట్లాడుతుండగా అధికారపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రశ్నను రేపటికి వాయిదా వేయమని కోరి మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నావు.. నోర్మూసుకుని కూర్చో! అంటూ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించగా, మరో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా వంతపాడారు. దీనికి అరుణ తీవ్రంగా స్పందించారు. ‘ఏం మాట్లాడుతా వ్.. నీకు మహిళల పట్ల గౌరవం లేదు.. మీ ప్రభుత్వంలో మహిళా మంత్రులకు స్థానం లేదు.
 
మీరేనోర్మూసుకోండి’ అంటూ మండిపడ్డా రు. దీంతో మంత్రి కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. కొన్ని సమీకరణాల వల్ల మహిళలకు స్థానం ఇవ్వలేకపోయామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలా మహిళా అధికారులను జైలుకు పంపలేదని, మహిళా మంత్రులను సీబీఐ కేసుల్లో ఇరికించలేదని అన్నారు. ‘మీ దాదాగిరి మహబూబ్‌నగర్‌లో నడిచిందేమోగాని ఇక్కడ నడవదు. ఇది శాసనసభ, బంగళా రాజకీయాలు చెల్లవు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అరుణ...  మైక్‌ను విరిచి నేలపైకి విసిరికొట్టారు. తర్వాత పోడియం వద్దకు వచ్చి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెకు మద్దతుగా ఇతర కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. ప్రతిగా టీఆర్‌ఎస్ సభ్యులు కేకలు వేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement