తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ బహుమతి ప్రకటించారు. వారికి ఒక నెల మూల వేతనాన్ని ప్రోత్సాహకంగా ఇవ్వాలని అధికారులను ఆదేశిం చారు. ‘ప్రక్షాళన’లో ప్రత్యక్షంగా పాల్గొన్న 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది వీఏవో లు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు కలిపి మొత్తంగా 35,749 మందికి ఒక నెల మూల వేతనం బోనస్‌గా అందనుంది.
ముఖ్యమంత్రి శనివారం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ప్రశంసించారు. ‘‘రెవెన్యూ ఉద్యోగులు దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం వంద రోజుల వ్యవధిలోనే రేయింబవళ్లు పనిచేసి భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల పక్షాన రెవెన్యూ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.
గందరగోళాన్ని సరిచేశాం..
దాదాపు 80 ఏళ్లుగా భూరికార్డుల నిర్వహణ సరిగా లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. క్రయవిక్రయాలు, యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేశారు. భూరికార్డులు గందరగోళంగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం పథకం అమలుకు ఏ భూమికి ఎవరు యజమానో కచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూరికార్డులను సరిచేయాలని సంకల్పించాం.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి, రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారు. సొంత భూములున్నవారు, అసైన్డ్‌దారుల వివరాలను కూడా కొలిక్కి తెచ్చారు. రాష్ట్రంలో పంచిపెట్టిన 22.5 లక్షల ఎకరాల భూమికి గాను 20 లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చింది. రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహా మిగతా భూములన్నీ క్లియర్ అయ్యాయి. దేశంలో ఎవరూ సాధించని ఘనత మన రెవెన్యూ ఉద్యోగులు సాధించారు. వారికి ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని బోనస్‌గా అందిస్తున్నాం..’’అని చెప్పారు.
కలెక్టర్లకూ అభినందన
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో భూరికార్డుల ప్రక్షాళన నిరూపించిందని కేసీఆర్ పేర్కొన్నారు. చిన్న జిల్లాలు ఉండడం వల్లనే భూరికార్డుల ప్రక్షాళన విజయవంతంగా నిర్వహించగలిగామని.. కొత్త కలెక్టర్లు తమ విధిని గొప్పగా నిర్వహించారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా రెండు లక్షలలోపే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడా సంఖ్య చాలా పెరిగిందని చెప్పారు.
నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు, రోడ్ల నిర్మాణంలో పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇతర అభివృద్ధి పనుల్లో మిగతా శాఖల అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతికి ఆస్కారమివ్వని విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు లభించాలన్నదే తమ అభిమతమని.. అందుకే తెలంగాణ ఇంక్రిమెంటుతో పాటు 42 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేశామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మంచి జీతభత్యాలు ఇస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు జి.ఆర్. రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, రాజేశ్వర్ తివారీ, రామకృష్ణారావు, శివశంకర్, వాకాటి కరుణ, స్మితా సభర్వాల్, కలెక్టర్లు రఘునందన్‌రావు, ఎంవీ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment