ఎంపీడీవోలకు బదులు ఓఎస్డీలు
• కొత్త మండలాల్లో నియమించనున్న సర్కారు
• జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడే మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవోల)కు బదులుగా.. ప్రత్యేక అభివృద్ధి అధికారుల (ఓఎస్డీ)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మండలాల్లో ప్రస్తుతం మండల పరిషత్‌లు లేనందున వారిని ఓఎస్డీ (డెవలప్‌మెంట్)లుగా నియమించి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించనుంది. ఇందుకు అవసరమైన అధికారులను గుర్తించి ప్రతిపాదనలు రూపొందిం చాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది.
ఇక కొత్త జిల్లాలకు అవసరమయ్యే ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను అన్ని శాఖల అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శుక్రవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సన్నద్ధంగా ఉండండి
కొత్తగా ఏర్పడే మండలాలు, డివిజన్‌లన్నింటిలో అక్టోబర్ 11న దసరా నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను రాజీవ్‌శర్మ ఆదేశించారు. ముఖ్యం గా తొలి రోజున అన్ని మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయం, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు కొలువు దీరుతాయి. దీంతో ఈ ఐదు శాఖలు వెంటనే తమ సిబ్బంది ప్రతిపాదనలు రూపొందించాలని, ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త జిల్లాల్లో ప్రాధాన్యతలకునుగుణంగా అక్కడి ప్రజలకు మెరుగైన సేవలందించే ఏ ర్పాట్లు చేయాల స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో ఉన్న ప్రత్యేకతలు, భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి ఆయా శాఖలకు సరిపడే సిబ్బంది నియామకం జరగాలన్నారు.
అన్ని వివరాలతో..
ప్రతి శాఖ పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది వివరాలు, సిబ్బంది నమూనా, కార్యాలయాల గుర్తింపు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సర్దుబాటు తదితర వివరాలన్నీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సీఎస్ సూచించారు. కొత్తగా అవసరమయ్యే పోస్టుల వివరాలను పంపడంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల జాబితాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను స్పష్టంగా అప్‌లోడ్ చేయాలని.. ఉద్యోగుల ఆధార్ నంబర్లను సైతం అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లేని ఉద్యోగులు కొత్తగా కార్డు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్‌కే జోషి, ముఖ్య కార్యదర్శులు బి.పి.ఆచార్య, రామకృష్ణారావు, సోమేష్‌కుమార్, అదర్ సిన్హా, సునీల్‌శర్మ, రాజీవ్ త్రివేదీ, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.