సెల్ఫీ చాలు | Telangana Government Launch New App For Easy Service To Beneficiaries | Sakshi
Sakshi News home page

సెల్ఫీ చాలు

Published Wed, Sep 11 2019 2:34 AM | Last Updated on Wed, Sep 11 2019 5:37 AM

Telangana Government Launch New App For Easy Service To Beneficiaries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే, మీరు బతికే ఉన్నారంటూ సర్టిఫికెట్‌తీసుకుని రండి. అప్పుడు మీ దరఖాస్తు పరిశీలిస్తాం’ – ఇదీ ఇప్పటివరకు పింఛనుదారులు లేదా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చాలా సందర్భాల్లో  ఎదురైన అనుభవం. కళ్ల ముందే మనిషి కనిపిస్తున్నా.. మీరు బతికే ఉన్నారని, ఫలానా రామారావు మీరే అని కాగితాల ద్వారా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇందుకోసం కాళ్లరిగేలా ఆ కార్యాలయం, ఈ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కేవలం ఒక్క సెల్ఫీతో ఈ సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి. మీరు ఇంట్లోనే ఉండి ఒక్క సెల్ఫీ తీసి పంపిస్తే చాలు.. మీకు రావాల్సిన ప్రయోజనాలు నేరుగా అందుకోవచ్చు.

ఎలా పనిచేస్తుంది?
ఆధునిక సాంకేతికతతో దూసుకెళ్తున్న మన రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సమ్మిళితం చేసి ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. మూడు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి దానిని మొబైల్‌ యాప్‌తో అనుసంధానించడం ద్వారా ఈ వినూత్న సాంకేతికతకు రూపునిచ్చారు. ఇప్పటివరకు దేశంలో రెండు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి ఫలితాలు సాధించగా.. మన దగ్గర మూడురకాల సాంకేతికతలను ఉపయోగించేలా సిద్ధం చేసిన యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌     రూపొందించింది. ఒక్క సెల్ఫీతోనే దీని కచ్చితత్వం ప్రస్ఫుటమవుతుంది. ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను టీ యాప్‌ ఫోలియోలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం దీనిని కొంత మేరకు ట్రెజరీ విభాగంలో రిటైరైన ఉద్యోగుల పెన్షన్‌ పంపిణీ కోసం వినియోగిస్తున్నారు. రెండు మూడు నెలల్లో దీనిని ఈ విభాగంలో మరింతగా విస్తరించనున్నారు.

ఆసరాలో ప్రయోగాత్మకంగా..
ఈ కొత్త యాప్‌ను ఆసరా పింఛన్ల విషయంలోనూ ప్రయోగాత్మకంగా పరిశీలించారు. పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్‌ సీఈవో పౌసమిబసు చొరవతో ఇటీవల సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో ఈ మొబైల్‌యాప్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా పరిశీలించి చూశారు. ఈ గ్రామంలో 60 మంది వృద్దాప్య పింఛన్లు పొందుతున్న వారిని మొబైల్‌ యాప్‌ ద్వారా పరిశీలించగా 59 మంది వివరాలు సరైనవేనని తేలింది. ఒక్కరి విషయంలోనూ వివరాలు సరిగా లేకపోవడంతో డేటాబేస్‌లోని సమాచారంతో మ్యాచ్‌ కాలేదు.

ప్రయోజనాలేంటి?
పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛనుతో సహా ఆసరా పింఛనుదారులు, వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల లబ్దిదారులు జీవించి ఉన్నారా లేదా నిజమైన లబ్దిదారులకే ఇవి అందుతున్నాయా అని కచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఈ మొబైల్‌ యాప్‌ ఉపయోగపడనుంది. అలాగే లెర్నింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్, ఇతర సర్వీసుల కోసం రవాణా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్ద నుంచే సెల్ఫీ తీసుకుని ఆయా సేవలను పొందే వెసులుబాటు కలగనుంది. ఇక పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పింఛను పొందాలంటే ప్రతి ఏడాది ‘వార్షిక పెన్షనర్‌ లైవ్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాల్సి ఉండేది.

ఇందుకోసం వారు ట్రెజరీ, పెన్షన్‌ కార్యాలయాలకు వెళ్లి తాము జీవించి ఉన్నట్టుగా స్వయంగా సర్టిఫికెట్లు సమర్పించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. సొంత లేదా అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో పెన్షనర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సెల్ఫీ తీసుకుని, అవసరమైన వివరాలను పొందుపరిచి సబ్మిట్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే ట్రెజరీ డేటాబేస్‌లో ఉన్న వివరాల ఆధారంగా లైవ్‌ అథెంటికేషన్‌ పూర్తయి ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. అదే సమయంలో ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు అథెంటికేషన్‌ వెళుతుంది. పెన్షనర్‌ స్వయంగా లైవ్‌ అథెంటికేషన్‌ కోసం ట్రెజరీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.మాన్యువల్‌ ప్రక్రియలో ఎదురయ్యే చాలా ఇబ్బందులు ఈ యాప్‌తో తీరనున్నాయి.

మనుషుల ప్రమేయం లేకుండానే..
పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు వీలుగా యాప్‌ను రూపొందించాం. లబ్దిదారుడిని సెల్ఫీ తీయడం ద్వారా లైవ్‌ అథెంటికేషన్, పేరు, చిరునామా, ఇతర డెమోగ్రాఫిక్‌ వివరాలతో డేటాబేస్‌లోని 10, 15 ఏళ్ల క్రితం నాటి ఫోటోతో మ్యాచ్‌ చేస్తే ఈ వివరాలున్న వ్యక్తి.. సెల్ఫీ దిగిన వ్యక్తి ఒకరే అన్న అథెంటికేషన్‌ వస్తుంది. ఇందులో మొదటిది ఓకే కాకపోతే రెండో అంశానికి వెళ్లే అవకాశముండదు. మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమే అన్నీ చేస్తుంది. డెబిట్‌ కార్డు వినియోగం కోసం ‘టు ఫాక్టర్‌ టెక్నాలజీ’ని ఉపయోగిస్తుండగా మేము వినూత్నంగా ‘త్రీ ఫాక్టర్‌ అథెంటికేషన్‌’ను ఉపయోగించాం.
– జీటీ వెంకటేశ్వరరావు, ఎండీ టీఎస్‌టీఎస్, కమిషనర్‌ ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్‌ డెలివరీ

కచ్చితత్వం సాధించాం
ఎద్దుమైలారంలో ఆసరా పింఛన్ల లబ్దిదారులను ఈ యాప్‌ ద్వారా పరిశీలించాం. ప్రధానంగా వృద్ధాప్య పింఛను పొందుతున్న వారిని 60 మందిని ఎంపిక చేసి, మా డేటాబేస్‌లో ఉన్న ఫోటో, ఇతర వివరాలను లబ్దిదారుల సెల్ఫీతో మ్యాచ్‌ చేసి చూశాం. 59 మంది సమాచారం మ్యాచ్‌ అయ్యింది. ఒక వ్యక్తి వివరాలు సరిగా లేకపోవడంతో మ్యాచ్‌ కాలేదు.
– సూర్యారావు, సంగారెడ్డి జిల్లా అడిషనల్‌ డీఆర్‌డీఒ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement