కారు జోరుకు.. ఓట్లు గల్లంతు
- మూడు రెట్లు పెరిగిన గులాబీ ఓట్లు
- కాంగ్రెస్ కన్నా రెండింతలు ఎక్కువ
- పొత్తుతో నష్టపోయిన బీజేపీ
- టీడీపీకి దక్కని డిపాజిట్లు
గులాబీ సునామీలో ప్రధాన పార్టీల ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది. ఊడ్చిపెట్టినట్లుగా జిల్లాలో ఓటర్ల తీర్పు ఏకపక్షంగా వెల్లువెత్తటంతో టీఆర్‌ఎస్ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కసారిగా మూడింతలకు పెరిగింది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీఆర్‌ఎస్ ఈసారి ఏకంగా 12 స్థానాల్లో విజయపతాకం ఎగరేసింది. మొత్తం పోలైన ఓట్లతో పోలిస్తే అప్పుడు కేవలం 16.62 శాతం ఓటు బ్యాంకు పొందిన టీఆర్‌ఎస్ ఈసారి 48.38 శాతం ఓట్లు సాధించింది. 31.76 శాతం అదనంగా సంపాదించింది. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌పైనే ఆశలు పెట్టుకున్న పార్టీ ఈసారి తెలంగాణ సాధించిన ఘనత తమదేనని చెప్పుకోవటంతో పాటు ప్రజాకర్షక పథకాలతో ప్రజల్లోకి వెళ్లింది. దీంతో కొత్త రాష్ట్రం, కొత్త ఆశలు, ఆకాంక్షలన్నీ ఓటు బ్యాంకు రూపంలో టీఆర్‌ఎస్‌కు వెన్నంటి నిలిచాయి.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత తమదేనని చెప్పుకోవటం తప్ప ప్రజలను ఆకట్టుకునే సంక్షేమం, అభివృద్ధి ఎజెండాను మేనిఫెస్టోగా ప్రచారం చేసుకోవటంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. దీంతో జిల్లాలో జగిత్యాల మినహా ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. గత ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి చావుతప్పి కన్ను లొట్టబోయినంతపనైంది. ఒక్క సీటుతోనే పరువు కాపాడుకుంది. ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 26.75 శాతం ఓట్లు లభించాయి. అంటే టీఆర్‌ఎస్‌తో పోలిస్తే 21.63 శాతం ఓట్లతో వెనుకబడింది. కాంగ్రెస్‌తో పోలిస్తే టీఆర్‌ఎస్ ఇంచుమించుగా రెండింతల ఓట్లు సాధించే దిశగా పరుగులు తీసింది.
అందుకే ఉన్నఫళంగా 12 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ సీట్లు గులాబీ ఖాతాలో జమయ్యాయి. 2004లో కాంగ్రెస్ పొత్తుతో టీఆర్‌ఎస్ జిల్లాలో పది స్థానాల్లో పోటీ చేసి అయిదింటిని గెలుచుకుంది. అప్పుడు కాంగ్రెస్-టీఆర్‌ఎస్ కలిసికట్టుగా సాధించింది 48.37 శాతం ఓట్లు. ఇప్పుడు టీఆర్‌ఎస్ ఒక్కటే అంత మొత్తం ఓట్లను కూడగట్టుకోవటం విశేషం. టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు జిల్లాలో ఒక్క సీటు గెలుచుకోలేకపోయాయి. టీడీపీ పోటీ చేసిన ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నాయకుడు ఎల్.రమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావుకు సైతం ఘోర పరాభవం తప్పలేదు. టీడీపీతో పొత్తు కూడటం వల్ల బీజేపీకి నష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంతో పాటు తెలంగాణ ఉద్యమ ఊపుతో జిల్లాలో బీజేపీ కాస్తా పుంజుకుంది. ఆరు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ రెండు చోట్ల నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రత్యర్థులతో తలపడింది. వేములవాడ, కరీంనగర్‌లో ఆ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. రెండు పార్టీలు చెరో ఆరు స్థానాల్లో పోటీ చేశాయి. అక్కడ పోలైన ఓట్లలో 5.31 శాతం ఓట్లు టీడీపీకి వస్తే.. 8.02 శాతం ఓట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోవటం గమనార్హం.