ఆ కాలేజీలకు ‘తాత్కాలిక’ఊరట | Temporary relief to Engineering colleges | Sakshi
Sakshi News home page

ఆ కాలేజీలకు ‘తాత్కాలిక’ఊరట

Published Wed, Jul 8 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

ఆ కాలేజీలకు ‘తాత్కాలిక’ఊరట

ఆ కాలేజీలకు ‘తాత్కాలిక’ఊరట

అఫిలియేషన్ ఇవ్వాలని జేఎన్‌టీయూకు హైకోర్టు ఆదేశం  
తీర్పునకు అనుగుణంగా నిబంధనలు సవరించాలని స్పష్టీకరణ

 
 సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూ అఫిలియేషన్ నిరాకరించడంపై హైకోర్టుకు వెళ్లిన కాలేజీలకు ఊరట లభించింది. ఆయా కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలని, వాటిని వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని జేఎన్‌టీయూను మంగళవారం ఆదేశించింది. మూడేళ్లుగా ఏఐసీటీఈ అనుమతి ఉండి, 2014-15 వరకు అఫిలియేషన్‌తోపాటు తాజా గడువు లోపు గుర్తింపునకు దరఖాస్తు చేసుకుని కోర్టును ఆశ్రయించిన కాలేజీలకు ఈ అఫిలియేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ కాలేజీల్లో జేఎన్‌టీయూ ఎత్తిచూపిన లోపాలను ఏఐసీటీఈ పరిశీలించి, నిర్ణయం వెలువరించేంత వరకు తాత్కాలిక అఫిలియేషన్ పొందినకాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని సూచించింది. 2014-15 నాటికి అమలుల్లో ఉండి, ప్రస్తుతం అఫిలియేషన్ పొందలేని కోర్సులకూ ఈ తాత్కాలిక అఫిలియేషన్ వర్తిస్తుందని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు తీర్పు వెలువరించారు. తమకు జేఎన్‌టీయూహెచ్ అఫిలియేషన్ ఇవ్వడానికి నిరాకరించడాన్ని, సీట్ల సంఖ్యను తగ్గించడాన్ని సవాలు చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
 
 ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు మంగళవారం తీర్పునిచ్చారు. జేఎన్‌టీయూ చూపిన లోపాలను ఆయా కాలేజీలు సవరించుకున్నాయా లేదా అన్న అంశాలను పరిశీలించేందుకు బృందాలను పంపాలని ఏఐసీటీఈని ఆదేశించారు. పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి 2015-16 విద్యా సంవత్సరానికి తుది అఫిలియేషన్ ఇచ్చే జేఎన్‌టీయూకు నివేదిక సమర్పించాలని ఆ బృందాలకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఈనెల 28లోపే పూర్తి చేయాలని ఏఐసీటీఈకి స్పష్టంచేశారు. పరిశీలన చేసే కాలేజీని విద్యార్థులు ఎంపిక చేసుకుని ఉంటే, ఆ కళాశాలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇచ్చిన విషయాన్ని వారికి తెలియచేయాలన్నారు. ఏఐసీటీఈ ఏ కాలేజీ అఫిలియేషన్ అయినా తిరస్కరిస్తే.. ఆ కాలేజీ విద్యార్థులను ఇతర కళాశాలల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని వర్సిటీని ఆదేశించారు.
 
 ఆరు నెలల్లోపు నిబంధనలు వెల్లడించండి
 భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ తీర్పునకు అనుగుణంగా అఫిలియేషన్ నిబంధనలను సవరించాలని జేఎన్‌టీయూ పాలక మండలికి హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల సవరించేటప్పుడు న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, ప్రైవేటు కాలేజీల ప్రతినిధులను సంప్రదించాలని సూచించింది. సవరించిన నిబంధనలను ఆరు నెలల్లోపు బహిర్గతం చేయాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement