అన్ని రకాల వస్త్ర పరిశ్రమల సమాహారంగా టెక్స్‌టైల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామ....
స్థలం ఎంపిక చేసిన అధికారులు
3500 ఎకరాలు గుర్తించిన పరిశ్రమల శాఖ
భూ సేకరణకు రూ.100 కోట్లు మంజూరు
నిర్వాసితులతో ఆర్డీవో సమావేశం
నేటి నుంచి సర్వే ప్రారంభం
హన్మకొండ : అన్ని రకాల వస్త్ర పరిశ్రమల సమాహారంగా టెక్స్‌టైల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామ సమీపంలో నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. అతి పెద్ద టెక్స్‌టైల్ పార్కు, టౌన్‌షిప్ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇక్కడ అందుబాటులో ఉంది. దేశంలోనే వస్త్ర పరిశ్రమ రాజధాని వరంగల్ అనిపించే విధంగా భారీ స్థాయిలో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వస్త్ర పరిశ్రమకు పేరెన్నికగల షోలాపూర్, సూరత్, తిర్పూర్‌లలో తయారయ్యే అన్ని రకాల వస్త్రాలు.. ఒక్క వరంగల్‌లోనే తయారయ్యే విధంగా భారీ స్థాయిలో పరిశ్రమను స్థాపించనున్నారు. వస్త్రం తయారీతో పాటు రెడీమేడ్ బట్టల తయారీ యూనిట్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ పార్కు ఉద్యోగులు నివసించేందుకు అనువుగా టౌన్‌షిప్ సైతం నిర్మించనున్నారు. సకల సదుపాయాలతో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయడానికి భారీ ఎత్తున భూమిని సమీక రించాల్సి ఉంది. కనీసం రెండు వేల ఎకరాల స్థలాన్ని ఒకేచోట ఉండేలా సేకరించాలంటూ జిల్లా యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రెండు వేల ఎకరాలకు పైగా స్థలం ఒకే బిట్టుగా ధర్మసాగర్ మండలం దేవనూరు-ముప్పారం గ్రామాల మధ్య అందుబాటులో ఉంది. ఈ రెండు గ్రామాల మధ్య పట్టా భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఫారెస్టు భూములు ఉన్నారుు. వీటితో పాటు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొంత భూమి కలుపుకుంటే ఏక మొత్తంగా 3400 ఎకరాలు సేకరించవచ్చని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వ భూమి 2200 ఎకరాలు ఉండగా 1200 ఎకరాలు పట్టా భూమి ఉంది. టెక్స్‌టైల్ పార్కు భూ సేకరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. దీంతో భూసేకరణ పనులు వేగం పుంజుకున్నాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు సర్వే జరగనుంది.
రైతులతో ఆర్డీవో సమావేశం
ధర్మసాగర్ : టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం కోసం స్థల ఎంపిక పూర్తయింది. ఈ మేరకు శుక్రవారం వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావు ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గ్రామాల రైతులతో గ్రామ సభ నిర్వహించారు. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు సంతోషకరమే అయినప్పటికీ భూములు కోల్పోతున్న తమకు పూర్తిస్థాయి భరోసా కల్పించాలని రైతులు కోరారు. గతంలోనే కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు చాలా వరకు పట్టాలు లేవని, వీరి విషయంలో స్థానికుల అభియాప్రాన్ని సేకరించి నిర్వాసితులను గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు. భూ నిర్వాసితులందరికీ నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని, ఎటువంటి నష్టమూ కలుగకుండా చూస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. టెక్స్‌టైల్ పార్కు ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన సర్వే మూడు రోజుల్లో పూర్తి చేస్తామని ఆర్డీవో వెంకట మాధవరావు తెలిపారు.
ముప్పారం, దేవునూరు గ్రామాల్లో మొత్తం 3400 ఎకరాల భూమి అందుబాటులో ఉందని చెప్పారు. సర్వే జరుగనున్న ఈ మూడు రోజుల పాటు రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. ఆర్డీవో వెంట తహాశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు వెంకట్రాజం, రాజేంద్ర, ఎంపీటీసీ సభ్యులు విజయ్‌కుమార్, హేమ ఉన్నారు. అనంతరం టెక్స్‌టైల్ పార్క్ భూముల సర్వేపై ఆర్డీవో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్లు, సర్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.