ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది.
చివరిరోజు నేతల సుడిగాలి పర్యటన
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. చివరి రోజు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎంతోపాటు బరిలో ఉన్న అభ్యర్థులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి.. ఓట్లు అభ్యర్థించారు. 12 రోజులుగా హోరాహోరీగా చేసిన ప్రచారం ముగియడంతో.. ఆదివారం ఒక్కరోజు లోపాయికారిగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల నేతలు వ్యూహాల్లో మునిగారు. మరోవైపు ఈనెల 16న జరిగే పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అధికార టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇక్కడ మంత్రి తుమ్మలను బరిలోకి దింపింది.
మంత్రి కేటీఆర్‌ను ఎన్నికల ఇన్‌చార్జిగా నియమిం చింది. కేబినెట్‌లోని సగం మంది మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. మండలానికో మంత్రికి ప్రచార బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో రాంరెడ్డి వెంకటరెడ్డిపై నియోజకవర్గ ప్రజలకు ఉన్న అభిమానం, సానుభూతి, కాంగ్రెస్ సంప్రదాయ ఓటు, వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతునివ్వడంతో గెలుపొందుతామని ధీమాగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో వ్యూహా లను రచించారు. సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ తరఫున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు.