బీసీలకు వెన్నుపోటు
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచింది. జనాభాలో 52 శాతం మంది ఉంటే బడ్జెట్ కేటాయింపుల్లో కేవలం రూ.2500 కోట్లు ముష్టిగా వేసింది. మేనిఫెస్టోలో ఏటా రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేసింది. బీసీ కార్పొరేషన్ కింద లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. తక్షణమే పది బీసీ ఫెడరేషన్లకు ఒక్కొక్క దానికి రూ.100 కోట్లు కేటాయించాలి.
- ఆర్.కృష్ణయ్య, టీడీపీ
ఒరిగిందేమీ లేదు
బడ్జెట్ మొత్తం అంకెల గారడీలా ఉంది. వాస్తవానికి ఆమడ దూరంలో ఉంది. రైతులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను పూర్తిగా విస్మరించారు. కరువుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పకపోవడం దారుణం. రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం సిగ్గుచేటు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పూర్తిగా విస్మరించారు.
- పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ
కుమారుడు, అల్లుడి శాఖలకే నిధులు
బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు శాఖలకే పెద్దపీట వేశారు. మిగతా మంత్రుల శాఖలకు మొండిచెయ్యి చూపారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి కేటీఆర్ పేరు మాత్రమే ఉటంకించడం దేనికి సంకేతం..? మిగిలిన వారు మంత్రులు కాదా..?
- రవీంద్రకుమార్, సీపీఐ
దక్షిణ తెలంగాణపై వివక్ష
టీఆర్‌ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. ముఖ్యమైన కేటాయింపులన్నీ ఉత్తర తెలంగాణ జిల్లాలకే ప్రకటించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలను పూర్తిగా విస్మరించారు.
- జి.చిన్నారెడ్డి, కాంగ్రెస్
రహస్య ఎజెండా ఉంది
బడ్జెట్‌లో సీఎం ప్రత్యేక నిధి కింద రూ.4,675 కోట్లు కేటాయించడం వెనుక రహస్య ఎజెండా ఉంది. ఆ నిధులన్నీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే. ఒకవైపు రాష్ర్టం కరువుతో అల్లాడుతుంటే సీఎం విచక్షణ కింద ఇన్ని నిధులు కేటాయిస్తారా? ఉమ్మడి రాష్ర్టంలో సీఎం ప్రత్యేక నిధి కింద కేవలం రూ.500 కోట్లు ఉండేవి. బడ్జెట్ ప్రసంగాన్ని పరిశీలిస్తే కొండను తవ్వి ఎలుక తోక పట్టినట్లుంది.
- పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ఆలీ, కాంగ్రెస్
అన్ని వర్గాలకు సమన్యాయం
బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకుల కడుపు మండుతోంది. ఊళ్లలో వారి వెంట నిలిచే వారు లేకపోవడంతో దిక్కుతోచక విమర్శలు చేస్తున్నారు. కేంద్ర సాయం లేకపోయినా రాష్ట్ర అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.
- కర్నె ప్రభాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్
ఫీజుల ప్రస్తావనేది?
బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్, మధ్యాహ్న భోజన పథకం బిల్లుల బకాయిల చెల్లింపు ప్రస్తావన లేదు. కేజీ టు పీజీపై నిరాశే మిగిలింది. వ్యవసాయ రుణాల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా కనికరం లేకుండా కఠోరత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఇరిగేషన్‌కు రూ.25 వేల కోట్లు ప్రతిపాదించడం హర్షణీయం.
- చాడ వెంకటరెడ్డి, సీపీఐ కార్యదర్శి
తప్పుడు అంచనాల బడ్జెట్
రాష్ర్ట పన్నులు, ఇతర ఆదాయాలు, కేంద్ర వాటా కలిపి గతేడాది రూ.79 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు ఏకంగా లక్షకోట్ల రెవెన్యూ ఉంటుందని పేర్కొన్నారు. ఇంత ఆదాయం సమకూరాలంటే ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం వేయాలి. ప్రభుత్వ ఆస్తులను అమ్మాలి. లేదా గతంలో మాదిరి ఆదాయాలు రాలేదంటూ సంక్షేమ రంగాల కేటాయింపుల్లో కోత విధించాలి. కాబట్టి తప్పుడు అంచనాలతో రూపొందించిన భారీ బడ్జెట్ ఇది.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం
స్పష్టత ఏదీ..?
బడ్జెట్‌లో స్పష్టత లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, ఆర్థిక వనరుల సేకరణ వంటి అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. ఒక ఆలోచన, విజన్ లేకుండా అంకెల గారడీగా బడ్జెట్‌ను రూపొందించారు. సంక్షేమ పథకాల అమలుకు నిధులు ఏ మాత్రం సరిపోవు. యువత ఉపాధి, పర్యాటక రంగాలకు ప్రాధ్యానం కన్పించలేదు.
- రాంచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్సీ
సమగ్రాభివృద్ధి కాంక్షించే బడ్జెట్
ప్రజల ఆర్థిక స్వావలంబన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కాంక్షించేలా బడ్జెట్ ఉంది. సాగునీరు, సంక్షేమ, విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేశారు. బడ్జెట్ కేటాయింపులు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఉన్నాయి. ఐదేళ్లలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది.
- నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
తెలంగాణ మార్క్ కన్పించింది
బడ్జెట్‌లో తెలంగాణ మార్క్ స్పష్టంగా కన్పించింది. గత బడ్జెట్‌లతో పోల్చితే ప్రణాళికేతర కన్నా ప్రణాళికా బడ్జెట్‌కే పెద్దపీట వేశారు. అంకెల గారడీగా కాకుండా ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
సామాన్యుల బడ్జెట్
పెట్టుబడిదారుల జేబుల్లో నుంచి కాకుండా సామాన్యుల గుండెల్లో నుంచి వచ్చిన బడ్జెట్ ఇది. అన్ని వర్గాలకు సముచిత కేటాయింపులు జరిగాయి. బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయడం హర్షణీయం. అన్నివర్గాల వారికి సముచిత స్థానం దక్కింది.
- సతీశ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పేదల సంక్షేమ బడ్జెట్
ఇది పేదల సంక్షేమ బడ్జెట్. సాగునీరు, వైద్య విద్యా రంగాలకు పెద్దపీట వేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు దళిత, బీసీ, మైనార్టీలకు వరం లాంటివి. సాగునీటికి పెద్దపీట వేయడంతో రాష్ట్రం సస్యశ్యామలం కావడం ఖాయం. పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారు.
- గంగాధర్‌గౌడ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
అంతా మాటల గారడీ వైఎస్సార్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలు, మాటల గారడీ తప్ప మరేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు.మొదటిరెండు బడ్జెట్‌లలో చెప్పిన కథలనే మూడో బడ్జెట్‌లో కూడా చెప్పారన్నారు. అవి చేస్తాం.. ఇవి చేస్తాం అనే మాటలు తప్ప, ఇవి చేసి చూపించాం అన్న మాటలు ఎక్కడ వినిపించలేదన్నారు. ఒక్కో సమయంలో ఒక్కొక్కరి ఆటలు సాగుతాయని, అంతేకానీ దీర్ఘ కాలం మాటలు నడవవని ఆయన పేర్కొన్నారు.
ఈటల తెలుగు బడ్జెట్ అభినందనీయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమని, చాలా సంతోషంగా ఉందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో చేయడంపై సిగ్గుపడుతున్నానని ఆయన సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు. తెలుగు పేరుతో ఏర్పాటైన టీడీపీ ఆ భాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. తెలుగు అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరుతున్నానని తెలిపారు.
సీఎంకు లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖకు అధిక కేటాయింపులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆశించిన విధంగా నిధులను కేటాయించి వైద్యాన్ని పేదల చెంతకు తీసుకెళ్తామని చెప్పారు. నగరంలో నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని అన్నారు. ప్రస్తుతమున్న ఆస్పత్రులను ఆధునీకరిస్తామని, డయాలసిస్, డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బడ్జెట్ పై నేతల స్పందన
Published Tue, Mar 15 2016 4:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement