పరిగి, న్యూస్‌లైన్: ధాన్యం ఎంత మొత్తంలోనైనా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జేసీ ఎంవీ రెడ్డి అన్నారు. గురువారం ఆయన పరిగిలో డీసీఎమ్మెస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పరిగిలోని మీసేవ కేంద్రం, తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. పింఛన్ లబ్ధిదారులు పడిగాపుల విషయంపై డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. పరిగి మండల వ్యవసాయ అధికారిణి రేణుకా చక్రవ ర్తి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేడీఏ విజయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
ఆమెకు ఒకరోజు వేతనం కట్ చేయటంతో పాటు మెమో జారీ చేయాలని జేడీఏను జేసీ ఆదేశించారు. మీసేవ కేంద్రంలో రూ.300 తీసుకుని 160 రూపాయలకు మాత్రమే రసీదు ఇచ్చారని ఓ వ్యక్తి జేసీకి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నామని తెలిపారు. 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీన్ని మించి ఎంతైనా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 4100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులు కొందరు టార్పాలిన్ల గురించి అడగ్గా సరఫరా చేస్తామన్నారు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు సమయానికి లారీల కాంట్రాక్టర్ లారీలు పంపించకుంటే స్థానికంగా అద్దెకు మాట్లాడుకుని పంపించాలని డీసీఎమ్మెస్ అధికారులకు జేసీ సూచించారు. కుల్కచర్ల మండలం చౌడాపూర్‌లో డీసీఎమ్మెస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని రైతులు కోరగా పరిశీలిస్తామన్నారు. జేసీ వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీటీ అశోక్, డీసీఎమ్మెస్ పరిగి శాఖ మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, సిబ్బంది వెంకటేష్, రాములు తదితరులున్నారు.
ఎంత ధాన్యమైనా కొంటాం
Published Fri, May 23 2014 12:26 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement