డాక్టర్ శరత్... ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు ఏడు పత్రాలు ఏకకాలంలో అందించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబడిన ఐఏఎస్. ప్రజలు అండగా నిలబడితే చాలు.. కొండనైనా ఢీ కొట్టి సంక్షేమ పథకాలను నేరుగా పేదింటికి చేరవేస్తానే ఆత్మవిశ్వాసం ఆయనది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా.. అన్నింటికీ మించి రాజకీయ చైతన్యం ఉన్న మెతుకుసీమ ఫుల్‌చార్జి సంయుక్త కలెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు మోస్తున్నారు.
మా రాష్ర్టం.. మా పాలన అంటూ ఫుల్‌జోష్ మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య వారధిగా ఇరువురినీ బ్యాలెన్స్ చేస్తూ సర్కారు బండిని నడిపిస్తున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందించాలన్నదే తన లక్ష్యమంటున్న డాక్టర్ శరత్‌తో ‘సాక్షి’ప్రతినిధి ముఖాముఖి.
సాక్షి: జిల్లాలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయా? ఏ ప్రాతిపదికన వాటిని ఏరివేస్తున్నారు?
కలెక్టర్: 2011 జనాభా లెక్కల ప్రకారం కుటుంబాల సంఖ్యను నిర్ధారించాం. ఈ లెక్కన చూసినపుడు గ్రామీణ ప్రాంతంలో 5 శాతం, పట్టణ ప్రాంతంలో 10 శాతం రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం.
సాక్షి : ఆధార్ కార్డుకు, రేషన్‌కార్డుకు లింక్ పెడతారా?
కలెక్టర్: కచ్చితంగా. ఆధార్‌తో అనుసంధానం చేయని కార్డులను మొదటి సారే బోగస్ కార్డులుగా పరిగణిస్తాం, గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తాం. కార్డులో పేర్లు ఉన్న వ్యక్తులు ఉండి, ఆధార్‌తో అనుసంధానం కాని కార్డులకు కూడా మరో అవకాశం కల్పిస్తాం. అంతేకాకుండా వారికి ఆధార్ కార్డు అందేలా మేమే సపోర్టు చేస్తాం.
సాక్షి: బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ ఎలా ఉంటుంది?
కలెక్టర్: ఈనెల 4 నుంచి 15 తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. ఆగస్టు 15 లోపు ఈ బోగస్ రేషన్ కార్డుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తాం. ఒక ఇంట్లో ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయో చూస్తాం. కార్డుల్లో నిర్ధారించిన కుటుంబాలు, వ్యక్తులు ఉన్నారో..లేరో చూస్తాం. తప్పుడు సమాచారంతో కార్డులు పొందిన వారికి నోటీసులు ఇస్తాం. ఇక ఆ తర్వాత రెండు రకాల లిస్టులు తయారు చేస్తాం. అందులో ఒకటి పూర్తిగా బోగస్ కార్డుల లిస్టు , రెండవది మరణాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలతో కూడా మరో లిస్టు. వీఆర్‌ఓలు, డీలర్ల మీటింగ్ ఏర్పాటు చేసి మా దగ్గర బోగస్‌కార్డులు లేవు అని నిర్ధారణ పత్రం కూడా రాయించుకుంటున్నాం. అనంతరం ఏరివేత షురూ చేస్తాం.
సాక్షి: రేషన్‌కార్డుల ఏరివేతతో ప్రజల నుంచి వ్యతిరేకత రాదా?
కలెక్టర్: నిజమైన లబ్ధిదారులకు ఏ మాత్రం అన్యాయం జరకుండా బోగస్ కార్డు ఏరివేత జరుగుతుంది. అందువల్లే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాదనే భావిస్తున్నాం. కొంత మంది ఉద్యోగుల వద్ద కూడా తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయని తెలిసింది. అలాంటి వారి వివరాలు వెంటనే తెలియజేయాలని కోరాం.
సాక్షి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారా?
కలెక్టర్: అవును.. వర్షాలు కురవకపోవటం కొంత ఇబ్బందిగానే ఉంది. వ్యవసాయ పంచాంగాన్ని అనుసరించి ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచాం. కానీ దురదృష్టవశాత్తు సకాలంలో వానలు కురవటం లేదు. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించాం. జూన్ 15 వరకు ఇంకా సమయం ఉందని వారు చెప్పారు. అప్పటి వరకు వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులను అందించేందుకు యంత్రాగం సిద్ధంగా ఉంది.
సాక్షి: హరీష్‌రావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు ఆయన నియోజకవర్గంలో ఒక ప్రయోగం చేశారు కాదా?
కలెక్టర్: ఓ... అదా..! అవును నిజమే. ఆరో ఫేజ్ భూ పంపిణీలో దాదాపు 3,500 ఎకరాలను పంపిణీ చేయడంతో పాటు లబ్ధిదారునికి ఏడు డాక్యుమెంట్లు ఒకేసారి ఇచ్చాం. దాన్ని ఇప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలోనే (అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు) ప్రయోగాత్మకంగా అమలు చేశాం. అసైన్డ్ చేసిన తర్వాత భూమి చూపించలేదని, పాసు బుక్కులు, టైటిల్ డీడ్, సర్వే మ్యాప్, పహణీ రాలేదనే ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా చేశాం. దాన్నే రాష్ట్రమంతటా కూడా అనుసరించారు.
సాక్షి: ఇంకా ఏమైనా చేశారా?
కలెక్టర్: ప్రభుత్వ భూముల వివరాలను గ్రామాల వారీగా సర్వే నంబర్ల ప్రకారం సర్వే చేసి రికార్డు చేశాం. వాస్తవానికి జిల్లాలో ఎంత ప్రభుత్వ భూమి ఉంది? ఎక్కడ ఎంత భూమి కబ్జాకు గురైంది. ఏఏ భూముల మీద కోర్టుల్లో కేసులున్నాయి. ఏఏ భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి తదితర వివరాలను సేకరించి శాశ్వతంగా రికార్డు చేశాం. దీన్ని అప్పటి సీసీఎల్‌ఏ సీఎస్ మహంతి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసి, ఈ విధానం బాగుందని మేం చేసిన ఫార్మాట్‌నే మిగతా జిల్లాలకు ఇచ్చారు. రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలను పరిష్కరించాం. అంతేకాకుండా సమస్య పరిష్కారమైనట్లు లబ్ధిదారులతో సంతకం కూడా తీసుకున్నాం.
సాక్షి: వక్ఫ్ భూముల రికవరీ, పరిరక్షణ సాధ్యమేనా?
కలెక్టర్: మంత్రి హరీష్‌రావు ఈ భూముల విషయంలో చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. జిల్లాలో మొదటి సర్వేలోనే 26 వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు గుర్తించాం. రెండవ సారి సర్వే చేస్తున్నాం. మరో 8 వేల నుంచి 10 వేల ఎకరాల భూమి తేలవచ్చు. అంటే దాదాపు 35, 36 వేల ఎకరాల వక్ఫ్ భూమి జిల్లాలో ఉంది. ముతవల్లి ప్రధాన ప్రజాసేవకులు. వక్ఫ్ భూమి వాళ్ల అజమాయిషీలోనే ఉంటుంది. ముందుగా పునఃపరిశీలన చేస్తాం. సర్వే నంబర్ వారీగా భూములు గుర్తించి ఒక గెజిట్ తీసుకొని వస్తాం. ఆక్రమణదారులను గుర్తించి ఆ భూములను పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం.
సాక్షి: హరీష్‌రావు గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు కదా? జిల్లాలో మీరు ఏమైనా గొలుసుకట్టు చెరువులను గుర్తించారా?
కలెక్టర్: నిజంగా గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తే పాత రోజులను మనం తిరిగి తెచ్చుకున్నట్టే. పాత రోజుల్లో చూస్తే ఒక చెరువు కింద ఆయకట్టు ఉండేది. చెరువు నిండి అలుగు పారితే... ఆ నీళ్లు మరో చెరువులోకి వెళ్లేవి... అది కూడా అలుగు పారితే మూడో కుంటలోకి ఇలా వాగో.. ఏరో కలిసేంత వరకు చెరువుల మధ్య ఈ గొలుసు సిస్టం కనిపించేది. ఇప్పుడు అలుగులు ఒకరు ఆక్రమిస్తే ... ఆయకట్టునూ మరొకరు చెరపెట్టారు. రెవెన్యూ రికార్డుల్లో ఏది అలుగు, ఏది ఆయకట్టో భద్రంగా ఉంది. వాటి ఆధారంగా చెరువు అలుగులు గుర్తించి, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేసి గొలుసుకట్టు చెరువులు పునరుద్ధరిస్తాం.
సాక్షి: మంత్రి హరీష్‌రావు మిమ్ములను ఆదర్శ కలెక్టర్ అని కీర్తించారు కదా..! ఎందుకని?
కలెక్టర్: మొదటి నుంచి నాకు ఆఫీసులో గడపటం కంటే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడమంటేనే ఇష్టం. అలా చేసిన పనులే పటిష్టంగా ఉంటాయి. అసైన్డ్ భూముల్లో లబ్ధిదారులకు పట్టాలిస్తారు. కానీ భూమి ఎక్కడుందోచూపించరు. భూమి చూపిస్తే పట్టాలివ్వరు. కొన్ని చోట్ల టైటిల్ డీడ్ ఇవ్వలేదు. సర్వే మ్యాపు ఇవ్వలేదు. నేను సర్వే చేయించి ఎస్సీ,ఎస్టీ భూముల్లో 2,58,116 సమస్యలను గుర్తించాం. వీటి పరిష్కారంలో ఎప్పుడూ మెదక్ జిల్లా చివరిలో ఉండేది. ఇప్పుడు మాత్రం మెదక్ జిల్లా సమస్యలన్నీ పరిష్కరించి మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా ఉంది. వీఆర్‌ఓలను ఐకేపీ సిబ్బందిని సమన్వయం చేసి ఈ సమస్యలపై విచారణ చేయించి పరిష్కారం చేశాం. పరిష్కార పత్రం కూడా ఇంటింటికి వెళ్లి ఇచ్చాం.
సాక్షి: మీరు చేస్తున్న ఆకస్మిక పర్యటనలతో మంచి ఫలితాలు వస్తున్నా...ఉద్యోగుల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది కాదా?
కలెక్టర్: చెట్టుకు కాయలు ఉంటేనే రాయి విసురుతారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కచ్చితంగా పేదలకు అందాలి. బంగారు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ బిడ్డగా నా ప్రయత్నం నేను చేస్తాను. మా సిబ్బంది నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు. నాకు సహకరిస్తారనే నమ్మకం ఉంది. అందులో భాగంగానే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాను. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రజారోగ్యం చాలా కీలకం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఎన్నో ప్రశ్నలకు పరిష్కారం దొరుకుతుంది. ముందు ఆస్పత్రుల తీరు మెరుగుపరచాలి. కారణాలు ఏవైనా కావచ్చు...ఈ కాలంలో కూడ ఒక తల్లి రోడ్డు మీద ప్రసవించాల్సిన దుస్థితిని మనం అంగీకరించగలమా? కఠిన నిర్ణయాలు తీసుకొనే సందర్భంలో కొంత వ్యతిరేకత రావొచ్చు. దాన్నే తలుచుకుంటూ కూర్చోవడం నా నైజం కాదు.
నా పథం ప్రగతి పథం
Published Sun, Jul 6 2014 12:03 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement