భూకబ్జాలపై 3 కమిటీలు | three house committees on land encroachment issue | Sakshi
Sakshi News home page

భూకబ్జాలపై 3 కమిటీలు

Published Mon, Jan 5 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM

భూకబ్జాలపై 3 కమిటీలు

భూకబ్జాలపై 3 కమిటీలు

* సభా సంఘాలపై కసరత్తు ప్రారంభం
* చైర్మన్లుగా ఇప్పటికే తెరపైకి ఇద్దరి పేర్లు
* పార్టీల శాసనసభాపక్ష నేతలకు లేఖలు
* సభ్యుల పేర్లను సూచించాలని కోరిన అసెంబ్లీ కార్యదర్శి

సాక్షి, హైదరాబాద్: శాసనసభా సంఘాల ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. గత నవంబర్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివిధ అంశాలపై సభా సంఘాలు వేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా అంశాలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీల శాసనసభాపక్ష నేతలకు అసెంబ్లీ కార్యదర్శి తాజాగా లేఖలు రాశారు. హౌస్ కమిటీల్లో పనిచేయడానికి ఆయా పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాల్సిందిగా కోరినట్లు సమాచారం.

సభా సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అంశాలన్నీ భూ సంబంధమైనవే కావడం గమనార్హం. అయితే, వాటిపై మూడు వేర్వేరు కమిటీలు వేయాలన్న నిర్ణయం జరిగింది. ఈ మేరకు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లను  కమిటీల చైర్మన్లుగా పరిశీలిస్తున్నట్లు అనధికారిక సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించిన భూముల వ్యవహారాన్ని టీఆర్‌ఎస్ సభ్యులు కాలింగ్ అటెన్షన్ ద్వారా లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆయన 8.39 ఎకరాల ఎస్సీ అసైన్డు భూములను తన కబ్జాలో పెట్టుకున్నారన్న ఆరోపణలపై చర్చ జరిగింది.

అదే సమయంలో సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల ప్రభుత్వ అసైన్డు భూములు కబ్జాకు గురైనట్లు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిందని సభకు వివరించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పది జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు కేటాయించిన అసైన్డు భూముల కబ్జాపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని, దీనిపై సభా సంఘం వేయాలని పేర్కొన్నారు. అదే మాదిరిగా, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఎంఐఎం కాలింగ్ అటెన్షన్ ద్వారా చర్చ జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హౌసింగ్ సొసైటీల అక్రమాలను వెలికి తీయాలని, దీనికోసం మరో సభా సంఘం ఏర్పాటు చేయాలని సీఎం ప్రకటించారు.

అంతేకాకుండా, వక్ఫ్ భూములు భారీ ఎత్తున అన్యాక్రాంతమయ్యాయన్న ఎంఐఎం చర్చతో వక్ఫ్, భూదాన్, దేవాదాయ, చర్చి భూములతో పాటు సీలింగ్ భూముల అన్యాక్రాంతంపైనా ప్రత్యేకంగా మరో కమిటీని ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భూముల వ్యవహారాలపైనే మూడు కమిటీల ఏర్పాటుకు సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండు కమిటీలకు చైర్మన్లుగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇతర పార్టీల్లోనూ సభ్యుల ఎంపికపై ఎమ్మెల్యేల్లో ఆసక్తి నెలకొంది. అయితే, వీటిని శాసనసభ, శాసనమండలి సభ్యులతో కలిపి ‘జాయింట్ లెజిస్లేచర్ కమిటీ’లుగా ఏర్పాటు చేస్తారా లేదా అన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది.

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఉభయ సభల్లోనూ చర్చ జరిగిన కారణంగా ఈ అంశంపై జాయింట్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇక కమిటీల్లో సభ్యుల సంఖ్యపైనా ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులు ఉండే అవకాశముంది. అత్యధికంగా 15 మంది వరకు ఉండవచ్చని ఓ సీనియర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే, అధికారికంగా కమిటీలను ఎప్పుడు ప్రకటిస్తారన్నది ఇంకా స్పష్టంకాలేదు.

వాస్తవానికి రానున్న బడ్జెట్ సమావేశాల నాటికే సభ ముందుకు నివేదికలు వస్తాయని మొదట అనుకున్నా, వాటి ఏర్పాటులోనే జాప్యం జరుగుతున్నందున ఆగస్టులో జరిగే వర్షాకాల సమావేశాల నాటికి నివేదికలు సిద్ధమయ్యే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కానీ, సభాసంఘం ఏర్పాటయ్యాక మూడు నెలల్లోగా నివేదిక అందజేయాల్సి ఉంటుందని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement