AP36 కాదు TS 3 | to change tho Number plates of vehicles | Sakshi
Sakshi News home page

AP36 కాదు TS 3

Published Fri, Jun 13 2014 4:42 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

AP36 కాదు TS 3 - Sakshi

AP36 కాదు TS 3

- మారనున్న వాహనాల నంబర్ ప్లేట్లు
- జిల్లాలో 2.97 లక్షల వాహనాలు
- నాలుగు నెలల గడువు..  మళ్లీ తప్పని తిప్పలు

 సాక్షి, హన్మకొండ: కొత్త రాష్ట్రంలో కొంగొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలోని వాహనాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సూచించే విధంగా ఉన్న ఏపీ కోడ్ స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే విధంగా టీఎస్ (తెలంగాణ స్టేట్) కోడ్ అమలు కానుంది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు రవాణా శాఖ కేటాయించిన కోడ్ 36 ఇకపై.. 3గా మారనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. తమ వాహనాలపై ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ స్టేట్‌ను చూసుకోవాలనుకున్న అభిమానుల కల నెరవేరనుంది.
 
ఏపీ 36 బదులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ అక్షరక్రమం ఆధారంగా గతంలో ఉన్న 23 జిల్లాలకు వాహనాల నంబర్‌ప్లేట్లకు ఆంగ్ల అక్షరాలు, అంకెలతో ఉన్న కోడ్‌లను కేటాయించింది. అందులో వరంగల్ జిల్లాకు ఏపీ 36 కోడ్‌గా అమలైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోరుు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. హైదరాబాద్‌లో గురువారం జరిగిన  రవాణాశాఖ  ఉన్నతాధికారుల సమావేశంలో తెలంగాణలోని పది జిల్లాలకు నంబర్ ప్లేట్ల కోడ్‌లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు వరంగల్ జిల్లా వాహనాలకు కోడ్‌గా టీఎస్ 3ని కేటాయించారు. ఇకపై కొత్తగా రిజిష్ట్రర్ అయ్యే వాహనాలకు టీఎస్ 3ని కోడ్‌గా కేటాయించనున్నారు. అదేవిధంగా పాతనంబర్ ప్లేట్లలో మార్పులు జరగనున్నాయి. ఉదాహరణకు ఏపీ 36 ఏహెచ్ 225తో ఉన్న నంబర్‌ప్లేట్ కొత్తగా తీసుకున్న నిర్ణయం వల్ల టీఎస్ 3 ఏహెచ్ 225గా మారుతుంది.

నాలుగు నెలలు.. మూడు లక్షల వాహనాలు
జిల్లాలో అన్ని రకాలు కలిపి దాదాపు 2.97 లక్షల వాహనాలు ఏపీ 36 కోడ్‌తో రిజిష్ట్రర్ అయి ఉన్నాయి. వీటిలో రెండు లక్షల వరకు ద్విచక్ర వాహనాలు, ముప్పైవేల వరకు ట్రాక్టర్లు, 25వేల వరకు కార్లు, మరో 20వేల వరకు ఆటోలు ఉన్నాయి. ఇవి కాకుండా 800 వరకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, పదిహేను వందల స్కూలు బస్సులు ఉన్నాయి. మిగిలిన వాహనాలు గూడ్సు ట్రావెల్స్, ప్యాసింజర్ ట్రావెల్స్‌గా రిజిష్ట్రర్ అయి ఉన్నాయి. కొత్తగా అమల్లోకి వస్తున్న నిర్ణయం వల్ల ఈ వాహనాల నంబర్లు అలాగే ఉన్నప్పటికీ వాటికి కేటాయించిన కోడ్‌లు మారినందున తప్పని సరిగా నంబర్‌ప్లేట్లను మార్చాలి. నాలుగు నెలలలోపు ఈ పని చేయాల్సి ఉంటుంది.
 
మళ్లీ దరఖాస్తు..
రవాణాశాఖలో ఆన్‌లైన్, స్మార్టు సేవలు విస్తృతమైన నేపథ్యంలో నంబర్ల ప్లేట్లను మార్చుకోవడం అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా స్టిక్కరింగ్ సెంటర్లకు వెళ్లి మార్పులు చేసుకునే అవకాశం లేదు. వాహనదారులు తమ నంబర్ ప్లేట్లు మార్చుకునేందుకు వరంగల్, జనగామ, మహబూబాబాద్‌లలో ఉన్న రవాణాశాఖ కార్యాలయాల్లో తగిన రుసుము చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనంతరం రవాణాశాఖ రికార్డులు, కేంద్రీకృత సర్వర్లలో పాతకోడ్ ఏపీ 36 స్థానంలో టీఎస్ 3గా మార్పులు చేపడతారు.

నాలుగు లక్షల వాహనాలకు సంబంధించిన రికార్డులను తిరగరాసే పని నాలుగు నెలల సమయంలో పూర్తి చేయడం కష్టం అనే సందేహాలు అప్పుడే వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా వాహనం కొన్నప్పుడే రిజిష్ట్రేషన్ల కోసం రవాణాశాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని, ఇప్పుడు ఉన్న పళంగా అన్ని వాహనాల నంబర్‌ప్లేట్ల మార్పు కోసం తిరిగి రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం, మళ్లీ రుసుము చెల్లించాల్సి రావడం వంటి పనుల పట్ల ఎంతో సమయం వృథా అవుతుందని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement