సాక్షి, ఖమ్మం: బంగారు తెలంగాణను చూడాలని వేయి కళ్లతో ఎదురుచూసిన ప్రజల కలలు కల్లలయ్యాయని, ఇందుకు పూర్తి బాధ్యత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా ఎన్నికల ముందు ఇచ్చిన పలు హామీలను టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదున్నర నెలల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. పంటలు ఎండిపోతూ ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు రాష్ట్రవ్యాప్తంగా 230 మంది ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఏజన్సీలో వైద్యం అందకపోవడంతో విషజ్వరాలతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నా అసలు డెంగీ మరణాలే లేవంటూ ప్రభుత్వం కొట్టివేయడం దారుణమన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్‌లను కేంద్రం ఇవ్వనందునే పాలన సాగడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, వారిని ఇస్తే ఆత్మహత్య చేసుకున్న రైతులు.. విషజ్వరాలతో మృతిచెందిన గిరిజనులను బతికిస్తారా..? ఎండిపోయిన పంటలను కాపాడతారా..? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడే విద్యుత్‌కష్టాలు మూడేళ్లపాటు ఉంటాయని ప్రకటిస్తే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌చేశారు.
సీసీఐ కేంద్రాల్లో రైతులకు పత్తి మద్దతుధర రూ.6వేలు ఇవ్వాలని, దళారీ వ్యవస్థకు మంగళం పాడితేనే కరువు పరిస్థితుల్లో రైతులకు ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని, రాష్ట్ర ప్రజల సమస్యలపై అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేస్తుందని చెప్పారు. బడ్జెట్‌లో శాఖలవారీగా నిధుల కేటాయింపుపై అంశాల వారీగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతుందన్నారు.
బంగారు కలలు కల్లలయ్యాయి
Published Wed, Nov 5 2014 3:35 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement