బడ్జెట్ రైలు పెండింగ్ ఫైలు!
కాజీపేటకు డివిజన్ హోదాపై చిగురిస్తున్న ఆశలు
* వ్యాగన్ నిధుల కేటాయింపు.. కోచ్ ఫ్యాక్టరీ పైనా..
* దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న జిల్లావాసులు
* సీఎం కేసీఆర్ దృష్టిసారించడంతో రేకెత్తిన ఆశలు
* జిల్లా నుంచి ఐదుగురు ఎంపీల ప్రాతినిధ్యం
* ఈ సారి సముచిత స్థానందక్కే అవకాశం
సాక్షి, హన్మకొండ : కాజీపేటకు డివిజన్ హోదా... వ్యాగన్ వర్క్‌షాపునకు నిధుల కేటాయింపు... కోచ్ ఫ్యాక్టరీ మంజూరు... ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు ఇవి. గతం సంగతి ఎలా ఉన్నా... నూతన రాష్ట్రం తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కాజీపేట జంక్షన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన కసరత్తు ప్రారంభించారు.
రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన కాజీపేట అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నారుు. ఈ క్రమంలో ఈసారి రైల్వే బడ్జెట్ జిల్లాకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... జిల్లా నుంచి రికార్డ్ స్థాయిలో ఐదుగురు ఎంపీలు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావుతోపాటు లోక్‌సభ సభ్యులు, కడియం శ్రీహరి, సీతారాంనాయక్ ఉన్నారు. పార్టీలకతీతంగా వీరందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే బడ్జెట్‌లో నిధుల కేటారుంపులతోపాటు కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయని జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు.
కాజీపేట డివిజన్ కల నెరవేరేనా...
కాజీపేటకు డివిజన్ హోదా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్ తర్వాత రైల్వే పరంగా కాజీపేట కీలక కేంద్రం. ఈ నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలంటూ జూన్‌లో ప్రధాని నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవతో సమావేశమయ్యారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అప్పుడు దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగులుతాయి. దాదాపుగా తెలంగాణలో రైల్వే పరంగా పాలన అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతుంది. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పెద్దపల్లి-నిజామాబాద్, భద్రాచలంరోడ్డు-కొవ్వూరు రైల్వే లేన్ల నిర్మాణంతోపాటు ప్రతిపాదన దశలో ఉన్న కరీంనగర్-సిద్ధిపేట-మనోహరాబాద్, మణుగూరు-రామగుండం వంటి కీలక ప్రాజెక్టుల పనులు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కాజీపేట కేంద్రంగా కొత్తగా డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డివిజన్ హోదా దక్కిన పక్షంలో రాష్ట్రంలో రైల్వే పరంగా అభివృద్ధి కాజీపేట కేంద్రంగా కొత్త పుంతలు తొక్కనుంది.
వ్యాగన్‌కు నిధులు మంజూరయ్యేనా...
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ నెలకొల్పేందుకు నాలుగేళ్ల క్రితమే రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. గత బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించినా... చివరకు నిరాశే మిగిలింది. అయితే కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ప్రాజెక్టులు ప్రోత్సహించేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్‌నకు ఈ సారి నిధులు మంజూరవుతాయని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అంతకుముందు ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేందుకు మూడేళ్లకుపైగా సమయం పట్టింది. ప్రస్తుతం అన్ని వివాదాలు దాటి కాజీపేట సమీపంలోని అయోధ్యపురంలో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి గత బడ్జెట్‌కు ముందుగా రైల్వేశాఖకు అప్పగించింది. ఈ మేరకు రైల్వేశాఖ తన వంతుగా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
కోచ్ ఫ్యాక్టరీకి బీజం పడేనా...
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో తెలంగాణ రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని రైల్వేశాఖను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీని రైల్వేశాఖ అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అధికారంలో ఉన్నప్పుడు కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. కానీ... రాజకీయ కారణాలతో ఈ ఫ్యాక్టరీ పంజాబ్‌లోని కపుర్తలాకు తరలిపోరుంది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ రైల్‌కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పితే ప్రత్యక్షంగా పది వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. కోచ్ ఫ్యాక్టరీ వంటి మదర్ ఇండస్ట్రీ నెలకొనడం వల్ల ప్రైవేట్ రంగంలో అనుబంధ పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశముంది. తద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ వేగంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది.