సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునఃసమీక్షా పిటిషన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముడిపడి ఉన్న వాటిని ఆ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలా.. వద్దా అన్న అంశంపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునఃసమీక్షా పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరపడంవల్ల ఏపీ న్యాయవాదులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏపీ హైకోర్టు ఏర్పడిన నేపథ్యంలో ఏపీకి చెందిన కేసులన్నింటినీ కూడా ఆ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది.
ఈ లేఖను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి దానిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, రిట్ పిటిషన్లు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులను ఏపీకి బదలాయించడంలో ఇబ్బంది లేదంది. రిట్ అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునః సమీక్షా పిటిషన్లను బదిలీ చేయడం సాధ్యం కాకపోవచ్చంది. ఉద్యోగుల సర్వీసు వివాదాలకు సంబంధించిన కేసుల విషయంలో కూడా తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంది. ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునఃసమీక్షా పిటిషన్లపై విచారణ జరిపే పరిధి ఉమ్మడి హైకోర్టుకు ఉందంటూ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 40(3) చెబుతోందనిగుర్తు చేసింది.
ఆ కేసుల బదలాయింపుపై త్రిసభ్య ధర్మాసనం విచారణ
Published Fri, Feb 1 2019 12:51 AM | Last Updated on Fri, Feb 1 2019 12:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment