అయ్యో.. ఇదేం గోస..?
అకాల వర్షం తెచ్చిన తంటా..
మూడు రోజులుగా నిలిచిన క్రయవిక్రయాలు
యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన నిల్వలు
తడిసింది ఆరేదాకా కొనుగోళ్లు బంద్
పలుచోట్ల రైతుల ఆందోళన
కరీంనగర్ అగ్రికల్చర్ :అకాల వర్షం తెచ్చిన తంటాతో మూడు రోజులుగా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులకు కరీంనగర్, పెద్దపల్లి, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్, మంథని తదితర ప్రాంతాల్లో మార్కెట్‌యార్డుకు తెచ్చిన ఉత్పత్తులు, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యం, కమ్ముకున్న మబ్బులసాకుతో కొనుగోలు చేయకుండా అధికారులు చేతులెత్తేశారు. ఉత్పత్తులను అమ్ముకోవడం నుంచి ధాన్యం తరలించేవరకు సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి అన్ని కేంద్రాల్లో స్పష్టమవుతోంది. మక్కల కొనుగోలు బాధ్యతను ఏజెన్సీ రూపంలో డీసీఎంఎస్, పీఏసీఎస్ ఆధ్వర్యంలోని 15కేంద్రాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జిల్లాలోని హుస్నాబాద్, పెద్దపల్లి కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. తేమ సాకుతో కొనుగోలు చేయకపోవడంతో వేరే దిక్కులేక రైతులు పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జేసీ సర్ఫరాజ్ అహ్మద్ మార్కెట్ కమిటీ, మార్క్‌ఫెడ్, సివిల్‌సప్లై అధికారులతో అత్యవసర సమావేశమై కొనుగోళ్లపై సమీక్షించారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టాకే కొనుగోలుకు సుముఖం తెలిపి నిర్ణయానికి వచ్చారు.
మూడు రోజులు బంద్
మరో మూడు రోజులపాటు మార్కెట్లకు బంద్ ఇవ్వాలని కలెక్టర్ ప్రకటించడంతో తెచ్చిన పంటను తిరిగి తీసుకెళ్లలేక.. వేరో చోట అమ్ముకోలేక గోసపడుతున్నారు. మార్కెట్ యార్డులో పడిగాపులు గాస్తున్న రైతుల్లో ప్రస్తుతం వర్ష సూచన గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో వర్షంవస్తే ధాన్యం కుప్పలపై కప్పడానికి సంబంధిత అధికారులు అవసరమైన టార్పాలిన్లు ఏర్పాట్లు చేయడంలేదు. ఇంటినుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లు, గోనె సంచులతో కాపాడుకుంటూ నిరీక్షిస్తున్నారు.
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం ఉదయం వెయ్యి క్వింటాళ్ల మక్కలు రాగా.. ఆ రోజు రాత్రి వరకు ధర నిర్ణయించిన డీసీఎంఎస్ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగగా.. కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటలు దాటినా అధికారులెవరూ కన్నెత్తి చూడలేదు. పైగా కొత్తగా 1300 క్వింటాళ్లు రాగా యార్డులో నిల్వలు పేరుకుపోయాయి. ఆ మక్కలలో అధిక తేమశాతం ఉన్నవాటిని సగానికి పైగా మక్కలను కొనుగోలు చేయలేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. 1900 క్వింటాళ్ల వరిధాన్యం రాగా.. వ్యాపారులు తేమ సాకుతో రూ.1340లోపే కొనుగోలు చేసి క్వింటాలుకు రూ. 60 వరకు దోపిడీ చేశారు.
సుల్తానాబాద్ మార్కెట్‌లో బుధవారంరాత్రి కురిసిన వర్షానికి మార్కెట్‌లో నిల్వ ఉన్న సుమారు 300 క్వింటాళ్ల వరిధాన్యం బస్తాలు తడిసిపోయాయి. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు సుల్తానాబాద్ మార్కెట్‌కు చేరుకుని, తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. పెద్దపల్లిలోసైతం మార్కెట్‌కు చేరిన మొక్కజొన్నలను అధికారులు తేమశాతం ఎక్కువగా ఉందనే సాకుతో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో అధికారులతీరుపై మండిపడ్డారు.
అకాల వర్షంతో తడిసిన ధాన్యానిన కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ హుస్నాబాద్‌లో వివిధపార్టీల నాయకులు, రైతులు స్థానిక వ్యవసాయమార్కెట్‌కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. చర్చల అనంతరం మార్క్‌ఫెడ్‌కు విక్రయించేందుకు తీసుకొచ్చిన మొక్కజొన్నలు తడిసినప్పటికి కొనుగోలుచేస్తామని మార్క్‌ఫెడ్ అధికారులు హామీఇచ్చారు. కాగా తూకంవేసిన వరి ధాన్యం తడిసిందని వాటిని తీసుకోమని చెప్పడంతో ఆందోళన ఉధృతమైంది. రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తేరాల మారుతి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి కొనుగోలుచేస్తామని చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.
బెజ్జంకి మండలంలో ధాన్యం తడవకపోయినా తేమ శాతం రాకపోవడంతో తూకం వేయలేదు. తేమ శాతం రాగానే ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. చొప్పదండి మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. మంగళ, బుధ వారాల్లో హమాలీలు, ఖరీదుదారుల మధ్య కూలీ రేటు పెంపుపై వివాదం నెలకొనడంతో రెండు రోజులు కొనుగోలు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్, పెగడపల్లి, ధర్మారం, ధర్మపురి మండలాల్లో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షం వస్తే ధాన్యం కుప్పలపై కప్పడానికి అధికారులు అవసరమైన టార్పాలిన్లు ఏర్పాట్లు చేయలేదు.
మంథనిలో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో పత్తిపంటను కొంతమంది రైతులు స్థానిక దళారులకు విక్రయిస్తుండగా, మరికొందరు పెద్దపల్లి, జమ్మికుంట, ఆదిలాబాద్ జిల్లా భైంసా మార్కెట్‌లకు తరలిస్తున్నారు. తేమశాతం సాకుతో మంథని మార్కెట్ యార్డులో, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యాన్ని నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు ధారపోసి నష్టపోతున్నారు.వేములవాడ యార్డుకు వరిధ్యానం అమ్ముకునేందుకు వస్తున్న రైతులకు సరిపడా కవర్లు అందించడం లేదు.