పరిగి అసెంబ్లీ నియోజకవర్గం
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల రేసు మొదలైంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉండటంతో ఆశావహుల సంఖ్య అధికమవుతోంది. ప్రధానంగా పరిగి శాసనసభ టికెట్‌కు పోటీ తీవ్రమవుతోంది. టీఆర్‌ఎస్ జిల్లా రాజకీయాలన్నీ ప్రస్తుతం దీని చుట్టే తిరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుమారుడు, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న మహేశ్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అధికార పార్టీ తరఫున గత ఎనిమిది నెలలుగా అన్ని బాధ్యతలు మోస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో పక్క నియోజకవర్గాల నేతల కన్ను పరిగిపై పడింది. ఓ పక్క కొప్పుల కుటుంబానికి అనుయాయులుగా ఉంటూనే మరో వైపు టికెట్ రేసులో తాము సైతం ఉన్నామంటూ పావులు కదుపుతూ.. గులాబీ గూటిలో వేడి పుట్టిస్తున్నారు.
పరిగి : అధికార పార్టీ తరఫున పరిగి అసెంబ్లీ టికెట్‌పై పలువురు నేతలు కన్నేశారు. నియోజకవర్గంలో ప్రస్తుతం మహేష్‌రెడ్డి టీఆర్‌ఎస్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే విద్యా మౌలిక వనరులు, అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌గా కొనసాగుతున్న నాగేందర్‌గౌడ్, కుల్కచర్ల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బుయ్యని మనోహర్‌రెడ్డి, గండేడ్ మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శైలేశ్‌రెడ్డి తదితరులు పరిగి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని యోచిస్తే.. ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తారని సమాచారం. ఇలా పరిగి టికెట్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.
ఉనికికోసం ప్రయత్నాలు...
తమ ఉనికిని చాటుకోవడం కోసం ఆశావహులు తలోరకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రేసులో ఉన్న నాగేందర్‌గౌడ్ తనకు సమయం చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఒకరిద్దరు స్థానిక బీసీ నేతలతో లోలోపల సత్సంబంధాలు నెరుపుతూ బీసీ కార్డుతో టికెట్ కోసం కృషి చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం చేవెళ్ల, ప్రస్తుతం నివాసముంటున్న వికారాబాద్ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ కావడం, తాండూరులో మంత్రి పాగా వేయడం, కొడంగల్‌లో తనకెలాంటి పట్టు లేకపోవటం, అక్కడి నుంచి ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సైతం టికెట్ ఆశిస్తుండటంతో నాగేందర్‌గౌడ్‌కు వేరే ప్రత్యామ్నాయం లేక పరిగిపై దృష్టి కేంద్రీకరించారు. ఇక కుల్కచర్ల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహర్‌రెడ్డి సైతం తనకు తెలిసిన వారితో అధిష్టానానికి దగ్గరయ్యే ప్రతయత్నం చూస్తూనే.. సేవా కార్యక్రమాల పేరుతో ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీనియర్ జర్నలిస్టు శైలేశ్‌రెడ్డి సైతం తనకు అధిష్టానం ఆశీస్సులున్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గ గులాబీ గూటిలో వేడి రాజుకుంది.
బలమైన కేడర్...
అధికార టీఆర్‌ఎస్ పార్టీకి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పరిగిలో బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఓటమిపాలైనా స్థానిక సంస్థల్లో విజయఢంకా మోగించారు. నియోజకవర్గంలో ఐదింటికి ఐదు జెడ్పీటీసీ స్థానాలు, ఐదింటిలో నాలుగు ఎంపీపీలు, అత్యధిక సర్పంచులు, పీఏసీఎస్‌లు, ఎంపీటీసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని రాజకీయంగా దీటుగా ఎదుర్కొంటూ వస్తున్నారు.
మహేష్‌రెడ్డికే అవకాశం...
టీఆర్‌ఎస్ అధిష్టానం, పార్టీ, ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా మహేశ్‌రెడ్డి పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. పలువురు నేతలు టీఆర్‌ఎస్ పరిగి టికెట్ కోసం పావులు కదుపుతుండగా.. నియోజకవర్గంలోని కేడర్ మాత్రం హరీశ్వర్‌రెడ్డి కుటుంబానికే మద్దతుగా నిలుస్తోంది. ఆయన అనార్యోగానికి గురై.. మహేశ్‌రెడ్డి కీలకంగా వ్యవరించడానికి పట్టిన సంది కాలంలోనూ పార్టీ శ్రేణులు మాత్రం హరీశ్వర్‌రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. ప్రస్తుతం వీరంతా టికెట్ రేసులో ముందున్న మహశ్‌రెడ్డిని అనుసరిస్తున్నారు. హరీశ్వర్‌రెడ్డి కోలుకున్నప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మాత్రం ఇతని తనయుడికే ఎక్కువగా ఉన్నాయి.
రైతు సమన్వయ సమితి పగ్గాలు చేపట్టిన రోజు నుంచి మహేశ్‌రెడ్డి సైతం నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఒక్కో రోజు పదికి మించి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యేందుకు శ్రమిస్తున్నారు. ఒకవేళ హరీశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే.. మంత్రివర్గం కూర్పులో మహేందర్‌రెడ్డికి పోటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో హరీశ్వర్‌రెడ్డి కాకుండా.. మహేశ్‌రెడ్డి బరిలో నిలిస్తే.. మహేందర్‌రెడ్డి సైతం మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పరిగి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా మహేష్‌రెడ్డికే ఉన్నాయనడంలో సందేహంలేదు.
Comments
Please login to add a commentAdd a comment