'బోగస్ సర్వేలతో టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్'
Published Thu, Mar 30 2017 7:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హైదరాబాద్: బోగస్ సర్వేలు, బోగస్ సభ్యత్వంతో టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ ఆడుతుదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి.అంతా బోగస్ కాకుంటే ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన వారిపై అనర్హతవేటు వేసి ఉప ఎన్నికలకు సిద్దంకావాలని ఆయన సవాల్ చేశారు.
గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పరిపాలన బోగస్, సర్వేలు బోగస్, పార్టీ సభ్యత్వం బోగస్, ఇచ్చిన హామీలు బోగస్, హామీలను అమలుచేశామని చెప్పడం బోగస్ అని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నదన్నారు. బడ్జెట్ లెక్కలన్నీ బోగస్ అని కాగ్ నివేదిక వెల్లడించిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నినాదాలుగా ఉన్న నీళ్లు రాలేదు, నిధుల్లేవు, నియామకాలు అసలేలేవని వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటిదాకా ప్రచారం చేసుకోవడం, ప్రజలను నమ్మించి మోసం చేయడం తప్ప ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదన్నారు. పార్టీ సభ్యత్వానికి ఎక్కడా లేని ఆదరణ వస్తున్నదని ప్రచారం చేసుకోవడం పెద్ద బోగస్ అని వ్యాఖ్యానించారు.
కాంట్రాక్టర్లను టీఆర్‌ఎస్ నాయకులు బెదిరించి, వేధించి సభ్యత్వ పుస్తకాలను నింపి పంపుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయని చేయించుకున్న సర్వే కూడా బోగస్ అని అన్నారు. టీఆర్‌ఎస్ పాలనపై సీఎం కేసీఆర్‌కు నమ్మకంలేకనే ఇలాంటి అబద్దాల సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నాడని, ప్రజాభిప్రాయాన్ని వక్రీకరిస్తున్నారని చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు నైతికత ఉంటే, గెలుస్తామనే నమ్మకముంటే ఇతరపార్టీల నుంచి చేరినవారి స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్దంకావాలని సవాల్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, రీడిజైన్‌లో లోపాలు వంటివాటిపై కాంగ్రెస్‌పార్టీ చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామన్నారు. పాలమూరు-రంగారెడ్డి మొదటి పంపుహౌజు రీడిజైన్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. జడ్చర్లకు రైల్వేలైను, జిల్లా ప్రజల ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రిని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలిసినట్టుగా వంశీచంద్‌రెడ్డి వెల్లడించారు.
Advertisement
Advertisement