
చంద్రబాబుకు జైలుశిక్ష తప్పదు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ముమ్మాటికీ సూత్రధారి చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు తప్పవు...జైలు శిక్షా తప్పదని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న డబ్బును రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా ర్యాలీకి ఉపయోగించారని జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన నేరస్తుడు అని ...అలాంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులపై వ్యాఖ్యలు చేయటమా అని మండిపడ్డారు.
మోటారు వాహనాల చట్టంలో డ్రైవర్ తప్పు చేస్తే ...ఓనర్కు కూడా శిక్ష పడుతుందని, అలాగే ఓటుకు నోటు కేసులో రేవంత్తో పాటు చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు. మరికొద్దిరోజుల్లో చంద్రబాబు కూడా ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయన్నారు.నోరున్నది కదా... అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే జనాలు.. రేవంత్ నాలుక కోస్తారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
రేవంత్ ఖబడ్దార్ పక్క రాష్ట్రాలకు సద్దులు మోసుకుంటా పోతున్నావు...ఒళ్లు, నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి.. నోరు పారేసుకుంటే మాత్రం...తెలంగాణ ప్రజలు నీ నోటికి కుట్లు వేస్తారంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఆట ముగిసిందని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకు పోతుందని జోస్యం చెప్పారు.