ఎవరు..ఎక్కడ? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే... | TRS MLAs Absent Official Meetings And Programmes | Sakshi
Sakshi News home page

ఎవరు..ఎక్కడ? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే...

Published Sat, Jan 5 2019 10:16 AM | Last Updated on Sat, Jan 5 2019 10:16 AM

TRS MLAs Absent Official Meetings And Programmes - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరక పోవటం, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఇంకా కొత్తవేవీ లేకపోవటంతో నగర ఎమ్మెల్యే ఫుల్లుగా కాలక్షేపం చేస్తున్నారు. కొందరు అత్యధిక సమయం ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. సన్నిహితుల శుభకార్యాలు, విందు భోజనాలకు హాజరవుతున్నారు. మరి కొందరు మాత్రం ఆరోగ్య కారణాలతో గెలిచిన కొన్ని రోజుల తర్వాత మాయమైపోయారు. గతంలో కేసీఆర్‌ కేబినెట్‌లో కీలక శాఖలు నిర్వహించిన సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, సికింద్రాబాద్‌  ఎమ్మెల్యే పద్మారావులు గడిచిన వారం క్రితం వరకు పార్టీ విజయోత్సవ సభల్లో పాలుపంచుకుని ప్రస్తుతం ఇళ్లు, క్యాంప్‌ కార్యాలయాలకే పరిమితమయ్యారు.

నగరంలో పంచాయతీ ఎన్నికల సందడి కూడా లేకపోవటంతో రాజకీయ సందడి తగ్గిపోవటంతో వారు కుటుంబసభ్యులకు అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే హన్మంతరావు తాజాగా పుణ్యక్షేత్రాల సందర్శనలతో బిజీగా ఉండగా..జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే గోపీనాథ్‌ శుభకార్యాలతో బిజీ అయ్యారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఎన్నికలకు ముందు..తర్వాత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడి కొంత కాలం విశ్రాంతి తీసుకుని ఇంటి నుండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు సైతం ఇళ్లు, క్యాంప్‌ కార్యాలయాల్లోనే అధిక సమయం గడుపుతున్నారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ ఇంకా విజయోత్సవ కార్యక్రమాల్లోనే బిజీగా ఉంటూ, మిగిలిన సమయాన్ని కుటుంబసభ్యులతో గడిపేస్తున్నారు..

సాయన్న ఎక్కడ..
కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుండి విజయం సాధించిన సాయన్న ఎన్నికల తర్వాత..మాయమైపోయారు. విజయానికి సంబంధించిన సర్టిఫికెట్‌ అందుకున్న తర్వాత ముఖ్య నాయకులకు సైతం అందుబాటులో లేకుండాపోయారు. ఆరోగ్య సమస్యలతోనే సాయన్న ఇతర ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని, అందుకే ఇటీవల కంటోన్మెంట్‌ బోర్డు సమావేశానికి కూడా హాజరు కాలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. సంక్రాంతి తర్వాతే సాయన్న ప్రజల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది..

చెన్నైలో దానం..
చివరి నిమిషంలో ఖైరతాబాద్‌ టికెట్‌ దక్కించుకుని విజయం సాధించిన దానం నాగేందర్‌  చెన్నైలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఎన్నికల్లో విరామం లేకుండా ప్రచారం చేసిన దానం, ఎన్నికల అనంతరం ఆరోగ్యసమస్యలతో ఇబ్బంది పడ్డారు. డిసెంబర్‌ చివరి వారమంతా ఇంటికే పరిమితమైన దానం, మూడు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి, తిరిగి మెరుగైన ఫిజియోథెరపీ కోసం చెన్నై చేరారు. పూర్తిగా ఫిట్‌ అయి సంక్రాంతి తర్వాతే విస్తృత కార్యక్రమాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement