రాజకీయం: అద్వితీయం | trs open akarsh plan success | Sakshi
Sakshi News home page

రాజకీయం: అద్వితీయం

Published Tue, Jun 2 2015 12:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాజకీయం: అద్వితీయం - Sakshi

రాజకీయం: అద్వితీయం

జోరుగా దూసుకుపోతున్న కారు విజయవంతంగా ఆపరేషన్ ఆకర్ష్ టీఆర్‌ఎస్ బలోపేతానికి చేరికల మంత్రం బంగారు తెలంగాణ నిర్మాణం పేర ఆహ్వానాలు వివిధ రాజకీయ పక్షాల నుంచి జోరుగా చేరికలు భవిష్యత్ రాజకీయాల కోసం ముందస్తు ప్రణాళిక ఏడాది కాలంలో టీఆర్‌ఎస్ అమలు చేసిన వ్యూహం ఇదే
 
హైదరాబాద్  ‘ఆపరేషన్ ఆకర్ష్..’ పార్టీ బలోపేతానికి.. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి తొలి ఏడాది అనుసరించిన వ్యూహం ఇదే. బంగారు తెలంగాణ నినాదంతో తమతో కలసి నడవాలని వివిధ పార్టీల నేతలను ఆహ్వానించి గులాబీ గూటికి చేర్చుకుంది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అందివచ్చిన అధికార పార్టీ హోదాను ఇందుకోసం సంపూర్ణంగా ఉపయోగించుకుంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ సాధించి టీఆర్‌ఎస్ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు అవసరం కాగా, దానికి కంటే మూడు సీట్లను మాత్రమే అదనంగా ఆ పార్టీ గెలుచుకుంది. కానీ, ఏడాది తిరిగేలోగా శాసనసభలో ఆ పార్టీ మెజారిటీ అమాంతం పెరిగి 76కు చేరింది. విపక్ష పార్టీలను బలహీనపరచి, బలమైన ప్రతిపక్షం లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో గులాబీదళం విజయవంతమైంది.

ఫలించిన ఆకర్షణ మంత్రం..
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో బలపడేందుకు టీఆర్‌ఎస్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించింది. బంగారు తెలంగాణ, రాష్ట్ర పునర్నిర్మాణం నినాదాలతో పార్టీలకతీతంగా తమతో కలిసొచ్చేవారు రావొచ్చని ఆహ్వానించింది. వివిధ రాజకీయ కారణాలతో కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఐదుగురు, వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు బీఎస్పీ సభ్యులు కూడా టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారు. ఇలా గులాబీ గూటికి చేరిన వారి సంఖ్య 13. దీంతో ఆ పార్టీ బలం 76కు చేరింది. రాష్ట్ర రాజధానిలో తమ ఆధిపత్యానికి అడ్డుపడ్డ టీడీపీని టార్గెట్ చేసి ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. మరో ఐదారు నెలల్లో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గె లవడానికి ముందుచూపుతో వ్యవహరించింది. ఈ చేరికలన్నీ అనైతికమని, ముఖ్యమంత్రి హోదాలో నేరుగా కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం ఇలా చేయడం సబబు కాదని  విపక్షాలు ఎంత మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. ఇంకా పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఏకంగా కేబినెట్‌లోకి తీసుకోవడం గమనార్హం. గతంలో టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన పద్ధతులనే టీఆర్‌ఎస్ కూడా ఆచరణలో పెట్టింది.
 
స్థానిక సంస్థలూ.. స్వాధీనం
శాసనమండలిలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు జిల్లా పరిషత్‌లపై టీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రమే టీఆర్‌ఎస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పుకోదగిన రీతిలో మండలాలు, మున్సిపాలిటీలు దక్కాయి. దక్షిణ తెలంగాణ లో కాంగ్రెస్ చేతిలో ఉన్న జెడ్పీలనూ తమవైపు తిప్పుకుంది. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండే జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులను వివిధ పార్టీల నుంచి తమ వైపు తిప్పుకుని గులాబీ కండువాలు కప్పేసింది.

 సంస్థాగతం.. నిరాశాజనకం
 రాజకీయంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టి ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించిన టీఆర్‌ఎస్.. ఏడాది కాలంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. సభ్యత్వ నమోదు విషయంలోనే కొంత హడావుడి చేసింది. పార్టీ ప్లీనరీని పూర్తి చేసుకుంది. సీఎం కే సీఆర్‌ను మరో మారు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకుంది. పధ్నాలుగేళ్ల ఆవిర్భావ సభనూ భారీ ఎత్తున నిర్వహించింది. కానీ, పార్టీ కేడర్‌కు పదవులను పంపిణీ చేయడంలో పెద్దగా చొరవ తీసుకోలేదు.
 
 మండలి పీఠం గులాబీ వశం
శాసనమండలిలో ఏ మాత్రం బలంలేని టీఆర్‌ఎస్ తమ పార్టీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్‌ను మండలి చైర్మన్‌ను చేయగలిగింది. కాంగ్రెస్ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్సీలను తన వైపు తిప్పుకుని మెజారిటీ సాధించింది. రాష్ట్ర విభజన అనంతరం విడిపోయిన మండలి 40 మంది సభ్యులతో కొలువుదీరగా, కాంగ్రెస్ నుంచి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్ సహకారంతో స్వామిగౌడ్‌ను మండలి చైర్మన్ పీఠం ఎక్కించింది.
 
 టెస్కాబ్ ‘గులాబీ’ వశం
పునర్విభజన చట్టం మేరకు ఆప్కాబ్ విడిపోవడంతో టెస్కాబ్(తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్) తొలి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ పెద్ద కసరత్తే చేసింది. వాస్తవానికి సహకార ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క జిల్లా బ్యాంకూ ద క్కలేదు. ఖమ్మం మినహా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే డీసీసీబీ చైర్మన్లుగా ఉన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం చైర్మన్లు టీఆర్‌ఎస్‌లో చేరగా.. మెదక్, రంగారెడ్డి చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి దించేసింది. 9 డీసీసీబీల్లో 6 తమ చేతికి వచ్చాకే టెస్కాబ్‌కు ఎన్నికలు నిర్వహించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement