సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటి పెరట్లో, పొలంగట్ల మీద, బంజరు భూముల్లో పెరిగే వృక్ష జాతులకు పెను గండం వచ్చింది. తెలంగాణను తరాలుగా పచ్చగా ఉంచిన రెండవ షెడ్యూల్‌లోని చెట్లను నరికి అమ్ముకోవచ్చని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కలప రవాణాలో కూడా గతంలో ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి, ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతి లేకుండానే సులువుగా తరలించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు æతెలంగాణ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ట్రాన్సిట్ నిబంధనలను సవరిస్తూ సెప్టెంబర్‌లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రైతులు అదనపు ఆదాయం సమకూర్చుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో భవిష్యత్తులో జామ, మామిడి, చింత, సీతాఫలాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ ఉత్తర్వుల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 శాతంగా ఉన్న పచ్చదనం సగానికి పడిపోయే ప్రమాదం ఉందని వృక్షప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడు షెడ్యూళ్లు..
మొక్కలను, వృక్షజాతులను అటవీ శాఖలో మూడు షెడ్యూళ్లుగా విభజన చేస్తారు. మొదటి షెడ్యూల్‌లో నరకటానికి వీలులేని వృక్ష జాతులను, రెండవ షెడ్యూల్‌లో అటవీ శాఖ అనుమతితో నరికివేసే వృక్ష జాతులను, మూడవ షెడ్యూల్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా కొట్టివేసే మొక్క జాతులను చేర్చారు. తెలంగాణ ప్రాంతంలో ఏపుగా పెరిగే వృక్ష జాతుల్లో 90 శాతం చెట్లు రెండవ షెడ్యూల్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో విస్తారంగా పండే మామిడి, సీతాఫలంతోపాటు చింత కూడా ఈ జాబితాలోనే ఉంది. రెండవ షెడ్యూల్‌లో ఉన్న ఈ వృక్ష జాతులను మూడవ షెడ్యూల్‌లోకి మార్చారు. æరాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన సవరణలో కీలకమైన వృక్ష జాతులు ఉండటంతో భవిష్యత్తులో తెలంగాణలో వాటి మనుగడ ప్రశ్నార్థకం కానుంది.
అనుమతి లేకుండానే..
తాజా ఉత్తర్వుల ప్రకారం... ఇప్పటి వరకు రెండవ షెడ్యూల్‌లో ఉన్న వెదురు, టేకు, సిల్వర్ ఓక్, యూకలిప్టస్, సుబాబుల్, నీలగిరి, సీమ తంగేడు, తుమ్మ, అశోక, తాటి, కొబ్బరి, జీడి మామిడి, సీమ చింత, మునగ, కానుగు, పాల కొడిసే , మామిడి, జామ, నారింజ, సపోటా, పనస తదితర వృక్ష జాతులను నరికి అమ్ముకోవచ్చు. రెవెన్యూ, ఫారెస్టు అధికారుల అనుమతి లేకుండానే కలపను ఇతర ప్రాంతాలకు తరలించ వచ్చు. మామిడికి మాత్రం నల్లగొండ జిల్లాతోపాటు, షెడ్యూల్ ఏరియాల్లో ఆంక్షలు విధించారు.
వెదురుకు ప్రమాదం
నల్లమల అడవుల్లో వెదురు విస్తారంగా పెరుగుతుంది. అటవీ శాఖ అధికారులు నిత్యం నిఘా పెట్టినా నల్లమల నుంచి ఏటా 500 టన్నులకు పైగా వెదురు బొంగులను స్మగ్లర్లు నరుక్కు వెళ్తారని అంచనా. ప్రభు త్వం వెదురుకు మినహాయింపు ఇవ్వడంతో నల్లమల అటవీ ప్రాంతాల్లో స్మగ్లర్లు యథేచ్ఛగా వెదురును నరికి, రైతుల పొలాల నుంచి నరికినట్లు నివేదికలు చూపించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదిలా ఉం డగా తాజా వెసులుబాటు రైతులు తమ వ్యవసాయ భూముల్లో విస్తృతంగా వెదురు పెంచేందుకు వీలు కల్పిస్తోంది. సాధా రణంగా వెదురు 6వ సంవత్సరం నుం డి 40 ఏళ్ల దాకా దిగుబడిని ఇస్తుంది. దీంతో వెదురు సాగుచేసే రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. వెదురు సాగు, అమ్మకం ద్వారా రైతులు తక్షణ ఆర్థిక లాభం పొందటంతో పాటు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనేందుకు వీలుపడుతుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment