సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత ఈ నెల 15 వరకు ఆపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. భవనాల కూల్చివేత అనుమతులపై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం షీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు సాయంత్రం సమర్పిస్తామని అటార్ని జనరల్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై రిప్లై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 15కు వాయిదా వేసింది.
ఆన్‌లైన్ క్లాసులపై పూర్తి వివరాలు సమర్పించండి..
ఆన్‌లైన్ క్లాసులకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఇవ్వకుండా ప్రైవేటు పాఠశాలలు ఎలా నిర్వహిస్తున్నాయి. వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ నిబంధనలు ప్రకారం కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం తరపున ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం చెప్పిన అంశాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆన్ లైన్ క్లాసులపై ప్రభుత్వ పాలసీ విధానం వారం రోజుల్లో చెబుతామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.జూలై 31 వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం వాదనలు విన్న ధర్మాసనం.. వచ్చే సోమవారం ఆన్‌లైన్ క్లాసులపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment