
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో ఏర్పాటు చేస్తున్న ప్రెషిషన్(విడిభాగాల తయారీ) ఇంజనీరింగ్ పార్కు భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆదేశించారు. దీని కోసం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం మాదారంలో 300 ఎకరాల భూములను ఎంపిక చేసినట్లు తెలిపారు.
బుధవారం పరిశ్రమభవన్‌లో ప్రెషిషన్ ఇంజనీరింగ్ పార్కు భూసేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాప్రా చిన్నతరహా పరిశ్రమల యజమానుల కోసం ప్రత్యేకంగా ప్రెషిషన్ ఇంజనీరింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు బాలమల్లు చెప్పారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, కాప్రా చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల యజమానుల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.