ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు విద్యుద్ఘాతానికి గురయ్యారు.
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా): ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ఎత్‌బార్‌పల్లిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎత్‌బార్‌పల్లి గ్రామానికి చెందిన మల్లాని ఈశ్వరమ్మ(55) సోమవారం ఉదయం ఊరి పక్కన పొలాల్లోకి బహిర్భూమికి వెళ్లింది. అయితే ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పొలాల్లోని విద్యుత్ స్తంభాలు ఒరిగి విద్యుత్ తీగలు కిందికి వేలాడాయి. పొలాల్లోకి వెళ్లిన ఈశ్వరమ్మ వేలాడుతున్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో తీగలు ఆమె తలకు తగిలి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో ఆమె పెద్దగా అరిచి కింద పడిపోయింది.
ఆమె అరుపులు విన్న గ్రామస్తులు ఒక్కసారిగా పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ(21) అనే యువకుడు అందరికంటే ముందుగా పరుగెత్తుకుంటూ వెళ్లాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలు అతని తలకు తగలడంతో అతడూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఇద్దరికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో గ్రామస్తులు వారిని వెంటనే స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. ఈశ్వరమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ ప్రస్తుతం భాస్కర ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు వారిని ఆదుకోవాలని గ్రామస్తులు విద్యుత్ అధికారులను కోరారు.