ఓఆర్‌ఆర్‌పై దారి దోపిడీ చేస్తున్న ఇద్దరి అరెస్ట్‌  | Two Held For Robbing On Outer Ring Road | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌పై దారి దోపిడీ చేస్తున్న ఇద్దరి అరెస్ట్‌ 

Published Sat, Mar 31 2018 8:34 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Two Held For Robbing On Outer Ring Road - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాజేంద్రనగర్‌ :  ఔటర్‌ రింగ్‌రోడ్డుపై దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ రమణగౌడ్‌ తెలిపి వివరాల ప్రకారం... చింతల్‌మెట్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ హైదర్‌(20), కిషన్‌బాగ్‌కు చెందిన సయ్యద్‌ యాయా(21) క్యాబ్‌ డ్రైవర్లు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన వీరు బతుకుదెరువు కోసం వలస వచ్చి క్యాబ్‌ డ్రైవర్లుగా పని చేస్తున్నారు.

సంపాదన సరిపోకపోవడంతో ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయాలని భావించారు. కానీ ధైర్యం చాలకపోవడంతో ఓఆర్‌ఆర్‌పై తమ వాహనంలో తిరుగుతూ ఆగి ఉన్న వాహనాల వద్దకు వెళ్లి వారితో మాటలు కలిపే వారు. అదను చూసి సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులు తీసుకుని ఉడాయించే వారు. ఈ నెల 4న కోకాపేట ఓఆర్‌ఆర్‌పై కారు చెడిపోవడంతో రాత్రి సమయంలో మరమ్మతులు చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి సహాయం చేస్తామంటూ నమ్మబలికి సెల్‌ఫోన్‌ తీసుకుని ఉడాయించారు. ఈ నెల 10న ఇందిరానగర్‌ ప్రాంతంలోని ఓఆర్‌ఆర్‌పై డీసీఎం డ్రైవర్‌ పక్కకు ఆపి కాలకృత్యాలు తీర్చుకుంటుండగా భయాభ్రాంతులకు గురి చేసి రూ. 8,900 నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకోని అతడిపై దాడి చేశారు.

రెండు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఓఆర్‌ఆర్‌పై నిఘా పెట్టారు. దొంగలించిన సెల్‌ఫోన్‌ను సయ్యద్‌ హైదర్‌ వాడుతుండటంతో దానిపై నిఘా వేసిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు సయ్యద్‌ యాయాను కూడా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.  

ఓఆర్‌ఆర్‌పై వాహనాలను ఆపకండి : ఇన్‌స్పెక్టర్‌ 
ఓఆర్‌ఆర్‌పై వాహనాలను ఆపవద్దని నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ రమణగౌడ్‌ వాహనదారులకు సూచించారు. అత్యవసరమైతే తప్ప వాహనాన్ని పార్కు చేయవద్దని చెప్పారు. ఎవరైనా దారి దోపిడీలకు పాల్పడితే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. దీని ద్వారా నిందితులను టోల్‌గేట్‌ల వద్ద అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దోపిడీ జరిగిన వెంటనే స్పందించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement