క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే! | un regulation buildings should Demolish | Sakshi
Sakshi News home page

క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే!

Published Sun, Nov 1 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే!

క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే!

కఠిన నిబంధనలతో ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పథకాలు
 
* 1985కు తర్వాతి కట్టడాల క్రమబద్ధీకరణ తప్పనిసరి
* లేకుంటే భారీ జరిమానాలు, కూల్చివేతలు..
* రిజిస్ట్రేషన్ల నిషేధం.. తాగునీరు, డ్రైనేజీ కనెక్షన్లు బంద్
* క్రిమినల్ కేసులు నమోదుచేసే అంశంపైనా పరిశీలన
* సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఇక నుంచి తప్పనిసరి కానుంది. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ సంఖ్యలో కట్టడాలు, అక్రమ లేఅవుట్లు పుట్టుకొస్తుండడం... అడపాదడపా అనుమతులు పొందుతున్నా నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుపుతుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సరైన ప్రణాళిక లేకుండానే పుట్టుకొస్తున్న నిర్మాణాలతో నగరాలు, పట్టణాలు రూపురేఖలు కోల్పోయి గజిబిజిగా మారడం, రహదారులు, వరద నీటి కాల్వలు, మురికికాల్వలు సైతం కుచించుకుపోయి ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. అక్రమ కట్టడాలతో వరద నీటి కాలువలు కనుమరుగైపోయాయి. వర్షం పడితే చాలు హైదరాబాద్ నగరం చెరువును తలపిస్తోంది. ఇలా పట్టణాభివృద్ధి ప్రణాళికల అమలుకు సైతం విఘాతంగా మారిన అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 ఇక కఠిన చర్యలు..
 ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అక్రమ లే అవుట్లు/ప్లాంట్లు, భవనాల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం ఇవ్వడంతోపాటు ఇకపై ఇలాంటి అక్రమాలకు తావు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు అక్రమ భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం కఠిన నిబంధనలతో  బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకాలను ప్రవేశపెట్టేందుకు పురపాలక శాఖ సన్నద్ధమైంది. ఇప్పటికే సిద్ధమైన ముసాయిదా జీవోలకు తుది మెరుగులు దిద్దుతోంది. సోమవారం విడుదల కానున్న ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే.. గత నెల 28వ తేదీలోపు నిర్మించిన భవనాలు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ తప్పనిసరి కానుంది.

అయితే 1985కు పూర్వం నిర్మించిన భవనాలకు మినహాయింపు ఇవ్వనున్నారు. 1985 నుంచి గత నెల 28లోపు నిర్మించిన భవనాలు, లేఅవుట్లకు క్రమబద్ధీకరణ పథకాలు వర్తించనున్నాయి. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం రెండు నెలల గడువు విధించనుంది. ఆ గడువులోగా క్రమబద్ధీకరించుకోని పక్షంలో తీసుకోబోయే కఠిన చర్యలను ఈ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా పొందపరుస్తున్నట్లు తెలిసింది. సదరు భవన, లేఅవుట్ల యజమానులు నిరంతరాయంగా నేరానికి పాల్పడుతున్నట్లు పరిగణించి భారీ జరిమానాలు విధించడం, చట్టప్రకారం కూల్చివేసేందుకు స్థానిక అధికారులకు అనుమతులు ఇవ్వడం, ఆయా ప్రాంతాల్లో తదుపరి నిర్మాణాలకు అనుమతులు నిరాకరించడం వంటి నిబంధనలను అమలుచేయనున్నారు. తాగునీటి కనెక్షన్, డ్రైనేజీ అనుసంధానాన్ని అడ్డుకోనున్నారు. దీంతోపాటు అక్రమ లేఅవుట్ల క్రయావిక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లను సైతం నిషేధించే అవకాశముంది. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉండే నిషేధిత ఆస్తుల జాబితాలో ఆ అక్రమ ప్లాట్లను చేర్చుతారు. వీటన్నింటితోపాటు క్రిమినల్ కేసుల నమోదుకు సైతం అనుమతి ఇచ్చే అంశాన్ని సర్కారు పరిశీలిస్తోంది. అయితే ఈ నిబంధనలను ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ ఉత్తర్వుల్లో పెట్టకపోతే... త్వరలో తీసుకురానున్న రాష్ట్ర భవన నిర్మాణ నియమావళిలో పొందుపరుస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement