'నా ఆస్తులన్నీ మెదక్ వాసులకిచ్చేస్తా'
తన ఆస్తులపై నాంపల్లి ప్రత్యేక కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయశాంతి స్పందించారు. తన పేరిట ఉన్న ఆస్తులన్ని తన మరణం తర్వాత మెదక్ వాసులకు ఇచ్చేస్తానని రాములమ్మ ప్రకటించారు. శనివారం మెదక్ అసెంబ్లీ పరిధిలోని రామాయంపేటలో విజయశాంతి ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ... సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చి వెనకేసుకుంది ఏమీ లేదని అన్నారు. ఏదైన ఉన్నా ఆ మొత్తం మెదక్ వాసులకు రాసిస్తానని ఉద్ఘాటించారు. పనిలోపనిగా టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మెదక్ అసెంబ్లీ పరిధిలోని రామాయంపేటలో విజయశాంతి ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు.
కేసీఆర్తో పాటు విజయశాంతి, హరీష్రావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ బాలాజీ వధేరా అనే న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావు, కాంగ్రెస్ నేత విజయశాంతి ముగ్గురూ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని వధేరా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ ముగ్గురి ఆస్తులపై దర్యాప్తు చేయాలని సీబీఐ కోర్టు శుక్రవారం ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది.