వినియోగదారుడా మేలుకో..! | Wake up Customer..! | Sakshi
Sakshi News home page

వినియోగదారుడా మేలుకో..!

Published Thu, Mar 15 2018 9:55 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Wake up Customer..! - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొనే ప్రతీ వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువై పోయాయి. చివరికి మనం తాగే పాళ్లు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండా పోతుంది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం చాలా ఉంది. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటు వారి హక్కులు, ఏర్పాటైన పరిరక్షణ చట్టం, ఫిర్యాదు ఏ విధంగా చేయాలనే వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌)


వినియోగదారులెవరు..? 
వినియోగదారులు హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే వారు వినియోగదారులు. కొనుగోలు దారుల అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకొనే వారు సైతం వినియోగదారులే. ఈ నిర్వచనం ప్రకారం అందరూ ఏదో ఒక రకంగా వినియోగదారులమే. 

చట్టంలో ఏముంది...? 
భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణకు ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తెచ్చింది. అదే వినియోగదారులు హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ‘రీడ్రసల్‌ ఫోరమ్స్‌’ను ప్రతీ జిల్లా కేంద్రంలోను ఏర్పాటు చేశారు. ఇవి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఫోరమ్స్‌గా మూడు విభాగాలుగా విభజించారు. జిల్లా స్థాయి కేంద్రానికి రిటైర్డ్‌ జిల్లా జడ్జి అధ్యక్షుడిగా, మరో ఇద్దరు మెంటర్లుగా ఉంటారు. మెజారిటీ కమిటీ సభ్యుల ఆమోదంతో ఫోరంలోని కేసులపై తీర్పు ఇస్తారు. వస్తువు లేదా సేవ విలువ, కోరే నష్ట పరిహారం రూ.లక్ష వరకు అయితే కోర్టు ఫీజు రూ.100, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రూ.200, రూ.10 లక్షల వరకు రూ.400, రూ.10 లక్షల పైన అయితే రూ.500 నామమాత్రపు కోర్టు ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

వినియోగదారుల హక్కులు... భద్రత హక్కు 
కొనే వస్తువులు, పొందే సేవలు వినియోగదారులు తక్షణ అవసరాలు తీర్చడమే కాకుండా అవి సుదీర్ఘ కాలం మన్నేలా ఉండాలి. అవి వినియోగదారుల జీవితాలకు, ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. ఈ భద్రత పొందటానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఐఎస్‌ఐ, అగ్‌మార్క్, హాల్‌మార్క్, వంటి నాణ్యతా చిహ్నాలు గల వస్తువులనే  కొనుగోలు చేయాలి. 

సమాచారం, ఎంపిక హక్కు.. 
వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవల నాణ్యత, పరిమాణం, ధరల గురించి సంపూర్ణ సమాచార పొందటం కూడా ఒక హక్కే. నిర్ణయం తీసుకునే ముందు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే అనేక రకాల వస్తువులు, సేవలను తగిన, సరసమైన ధరలలో పొందటం వినియోగదారుల హక్కు. లభిస్తున్న వస్తువులు, సేవలలో ఏది పొందాలనే ఎంపిక హక్కు కూడా ఉంది. 

అభిప్రాయం వినిపించే హక్కు.. 
వినియోగదారుల సంక్షేమార్థం వినియోగదారులు ఎవరైనా సరే వినియోగదారుల వేదికలపై అభిప్రాయాన్ని వినిపించవచ్చు. ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేసే పలు సంఘాల్లో ప్రాతినిథ్యం పొందగల రాజకీయేతర, వాణిజ్యేతర వినియోగదారుల సంఘాలను ఏర్పర్చుకోవడం ప్రాథమిక హక్కు. అలాగే అన్ని విషయాలు తెలిసిన వారు కావడానికి తగిన విజ్ఞానం, నైపుణ్యం, జీవన పర్యంతం పొందడం కూడా ఒక హక్కే. 

న్యాయం పొందే హక్కు.. 
అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్దమైన రక్షణ పొందవచ్చు. న్యాయ సమ్మతమైన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఫిర్యాదు ధనపరంగా చిన్న మొత్తానికో లేదా అంశానికో కావచ్చు... అయినా సమాజంపై దాని ప్రభావం అసమానం కావచ్చు. 

పర్యావరణ హక్కు.. 
పర్యావరణానికి ఏ హానీ కలుగకుండా ఉండే వస్తువులను, సేవలను పొందటం వినియోగదారులకు హక్కే. దీనిపై ప్రశ్నించడానికి సర్వ హక్కులు కల్పించారు.

కొనుగోలు విషయంలో సూచనలు... 
కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్‌కు చెందినవి, వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు, ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చింతగా గమనించాలి. మందులు–ఆహార పదార్థాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్‌పై చూపాలి. దేనిలో నెట్‌ కంటెంట్స్‌ ఎక్కువగా ఉన్నాయో చూసి కొనాలి. కాస్మోటిక్‌ ఉత్పత్తులపై తప్ప కుండా వస్తువు ధర, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువు ముద్రించి ఉండాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్‌పీపై స్టిక్కర్‌ అంటించి దాని ధరను మార్చి అమ్మడం జరుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా గమనించాలి. ఆటో మీటర్లను టాంపరింగ్‌ చేసి ఎక్కువ తిరిగేలా చేస్తుంటారు. వీటిని టైం టెస్ట్, బెంచ్‌ టెస్ట్‌ ద్వారా కనిపెట్టవచ్చు.

వినియోగదారులు బాధ్యతలు.. 
  -   అవసరమైన వస్తువులను మాత్రమే కొనాలి 
 -    గుడ్డిగా ఏ వస్తువులు కొనవద్దు 
 -    కొనే వస్తువు గురించి సమాచారాన్ని సేకరించాలి 
 -    మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్త వహించండి 
 -   వస్తువుల నాణ్యతపై రాజీ పడవద్దు, నాణ్యమైనవే కొనాలి 
 -   కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదును అడిగి తీసుకోవాలి 
 -    వస్తువు విషయంలో గ్యారంటీ/వారంటీ కార్డును షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడుతాయి 
 -    వాసిరకం వస్తువుల పట్ల, మోసపూరిత వ్యాపావస్తుల పట్ల వినియోగదారుల ఫోరాంను ఆశ్రయించడానికి వెనుకాడవద్దు

ఫిర్యాదు చేయడానికి గల కారణాలు.. 
ఒక వ్యాపారుడి ద్వారా, డీలర్‌ ద్వారా గాని వినియోగదారుడు నష్టపోయి ఉంటే సదరు వ్యక్తిపై లేదా సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు. వస్తువులో లేదా ప్రొడక్ట్‌ ఒకటి అంతకంటే ఎక్కువ లోపాలు ఉన్నప్పుడు సర్వీసు విషయంలో డీలర్‌ అశ్రద్ధ చేసేటప్పుడు, అసలు ధర కంటే ఎక్కువ మొత్తం సదరు వ్యాపారుడు, డీలర్‌ గాని వసూల్‌ చేసినప్పుడు, మరి ఏ ఇతర విధంగా నష్టపోయినా ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు ఎలా చేయాలంటే..? 
ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. అలాగే దానిపై స్పందన కూడా త్వరగా ఉంటుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. న్యాయవాది అవసరం లేదు, ఫిర్యాదుదారుడైనా, అతని ఏజెంటైనా ఫోరంలో స్వయంగా ఫిర్యాదు ఇవ్వవచ్చు. అలా వీలు కాకపోతే పోస్టు ద్వారా కూడా పంపే వీలుంది. 
 
ఫిర్యాదులో ఏం రాయాలి..? 
ఫిర్యాదుదారు పూర్తి పూరు, చిరునామా, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఇవ్వడం మంచిది. అలాగే, అవతలి పార్టీ పూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు చేయడానికి గల కారణాలు, ఎప్పుడు.. ఎలా.. జరిగింది, ఏ విధంగా నష్టపోయారనే విషయాలు తెలుపుతూ డాక్యుమెంట్లు, రసీదులు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఫిర్యాదుకు జత చేయాలి. ఇవి కేసు విచారణ సమయంలో ఉపయోగపడుతాయి. ఫిర్యాదుదారుడు ఏ విధంగా నష్ట పరిహారం అడుగుతున్నాడో వివరణ ఇవ్వాలి. 

పరిహారం బట్టి ఫోరం... 
    - రూ.20 లక్షల విలువ వరకు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి. 
    -  రూ.20 లక్షల విలువ నుంచి రూ.కోటి వరకు రాష్ట్ర కమిషన్‌లో.. 
    -  రూ.కోటి మించిన పక్షంలో జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి. 
    -   కొనుగోలు చేసిన లేదా నష్టం జరిగిన నాటి నుంచి రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణం చూపినచో ఆపై సంవత్సరం వరకు ఫిర్యాదు చేయవచ్చు.
 
ఇక్కడ సంప్రదించవచ్చు..

ఎం. రాజేశ్వర్, జిల్లా వినియోగదారులు సమాచార కేంద్రం చైర్మన్‌ కలెక్టర్‌ కార్యాలయం, వీడియో కాన్ఫరెన్స్‌ గది పక్కన, నిజామాబాద్‌  (93964 51999)

కృష్ణప్రసాద్, డీఎస్‌వో  జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం, జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, ప్రగతిభవన్‌ చివరి అంతస్తు, నిజామాబాద్‌ (80083 01506)  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement