- విస్తుగొల్పుతున్న జలమండలి అంచనాలు
- 2015 నాటికి గ్రేటర్ జనాభా కోటి... నీటి డిమాండ్ 732.43 ఎంజీడీలు
- 2021 నాటికి జనాభా 1.50 కోట్లు...నీటి డిమాండ్ 986.82 ఎంజీడీలు
- 2041 నాటికి జనాభా 3 కోట్లు...నీటి డిమాండ్ 1908.39 ఎంజీడీలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో నీటి లభ్యతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భవిష్యత్తులో జనాల అవసరాలకు సరిపడే స్థాయిలో నీరు దొరికే అవకాశాలు లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి. జనాభాతో పాటే నీటి కొరత కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. తాగునీటి ముఖచిత్రంపై జలమండలి రూపొందించిన తాజా అంచనాలు విస్తుగొల్పుతున్నాయి. ప్రస్తుతం మహా నగర జనాభా సుమారు కోటికి చేరువైంది. గృహ, వాణిజ్య అవసరాలకు నిత్యం నీటి డిమాండ్ 732.43 మిలియన్ గ్యాలన్లు కాగా.. కొరత 130.43 ఎంజీడీలుగా ఉంది. ఇక 2021 నాటికి నగర జనాభా 1.50 కోట్లకు చేరువకానుంది.
అప్పుడు నీటి డిమాండ్ 986.82 ఎంజీడీలకు చేరనుంది. కొరత 384.82 ఎంజీడీలు అవుతుందని అంచనా. ఇదే రీతిన లెక్కిస్తే 2041 నాటికి గ్రేటర్ జనాభా మూడుకోట్లకు చేరుకోనుంది. అప్పుడు రోజువారీ 1908.39 ఎంజీడీల నీరు అవసరమవుతుంది. కొరత కూడా 1306.39 ఎంజీడీలకు చేరుతుందని అంచనా. దీన్నిబట్టిపెరుగుతున్న జనాభాకు అవసరమైన తాగునీరు అందించడం భవిష్యత్‌లోనూసాధ్యపడదన్న సంకేతాలు వెలువడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాగునీటి సరఫరాలో నిత్యం లీకేజీలు, చౌర్యం కారణంగా ఏర్పడుతున్న 33 శాతం నష్టాలను గణనీయంగా తగ్గించుకుంటే ప్రజల దాహార్తిని తీర్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తాగునీటికి మహా డిమాండ్...
ప్రస్తుతం గ్రేటర్‌లో 8.64 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 385 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. త్వరలో కృష్ణా మూడోదశ ద్వారా మరో 45 ఎంజీడీలు, ఈ ఏడాది ఆగస్టు నాటికి గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ద్వారా మరో 172 ఎంజీడీల నీరు సిటీకి అందనున్నాయి. దీంతో మొత్తం 602 ఎంజీడీలు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా 130.43 ఎంజీడీలకు కొరత తప్పదని జలమండలి వర్గాలు ‘సాక్షి'కి తెలిపాయి.
గ్రేటర్‌లో విలీనమైన శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు, కాప్రా, అల్వాల్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, గడ్డిఅన్నారం, ఉప్పల్, రాజేంద్రనగర్ మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3195 కోట్ల వ్యయంతో మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లు, తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తేనే ఆ ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల దాహార్తి తీరనుందని జలమండలి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసింది. నిధులు విదిలిస్తేనే ఈ ప్రాంతాల దాహార్తి తీరనుందని సర్కారుకునివేదించింది.
తలసరి నీటి వినియోగంలో శివార్ల వెనుకంజ
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తలసరి నీటి వినియోగం (ఎల్‌పీసీడీ-లీటర్ పర్ క్యాపిటా డైలీ) 150 లీటర్లు. ఈ విషయంలో ప్రధాన నగరం శివార్ల కంటే ముందంజలో ఉంది. కోర్‌సిటీలో ప్రతి వ్యక్తికి రోజువారీ సరాసరి 150 లీటర్ల జలాలు సరఫరా చేస్తున్నట్లు జలమండలి తాజా నివేదిక వెల్లడించింది. శివార్లలోని వివిధ ప్రాంతాల్లో తలసరి నీటి వినియోగం 90 నుంచి 120 లీటర్ల మధ్యనే ఉందని స్పష్టం చేసింది. అక్కడ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ నెట్‌వర్క్స్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని తేల్చింది.
జనం జనం... జలం గగనం!
Published Sun, Jun 7 2015 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM
Advertisement
Advertisement