ఫోర్బ్స్ ప్రపంచ అతిపెద్ద కంపెనీల్లో మనవి 56
► భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్
► టాప్-10లో అమెరికా, చైనాలదే హవా
న్యూయార్క్: ఫోర్బ్స్ రూపొందించిన వార్షిక ‘గ్లోబల్ 2,000 అతిపెద్ద, శక్తివంతమైన కంపెనీలు’ జాబితాలో భారత్ నుంచి 56 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌లో ఉంది. ఇది 121వ స్థానంలో నిలిచింది. దీని మార్కెట్ విలువ 50.6 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (149వ స్థానం) ఉంది. దీని మార్కెట్ విలువ 23.3 బిలియన్ డాలర్లు. అలాగే భారత్ నుంచి జాబితాలో స్థానం పొందిన కంపెనీల్లో ఓఎన్‌జీసీ (220), ఐసీఐసీఐ బ్యాంక్ (266), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (275), ఇండియన్ ఆయిల్ (371), టీసీఎస్ (385), ఎన్‌టీపీసీ (400), భారతీ ఎయిర్‌టెల్ (453), యాక్సిస్ బ్యాంక్ (484), ఇన్ఫోసిస్ (590), భారత్ పెట్రోలియం (650), విప్రో (755), టాటా స్టీల్ (1,178), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (1,993), కోల్ ఇండియా (465), ఎల్‌అండ్‌టీ (505), ఐటీసీ (781) ఎం అండ్ ఎం (901), హెచ్‌సీఎల్ టెక్ (943), కొటక్ మహీంద్రా బ్యాంక్ (899) ఉన్నాయి.
ఫోర్బ్స్ జాబితా టాప్-3లో ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ), చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా అనే అన్ని చైనా బ్యాంకులే ఉన్నాయి. వారెన్ బఫెట్ బార్క్‌షేర్ హాత్‌వే 4వ స్థానంలో ఉంది. ఇక యాపిల్ 8వ స్థానంలో, వాల్‌మార్ట్ 15వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ 23వ స్థానంలో, ఐబీఎం 41వ స్థానంలో, ఫేస్‌బుక్ 188వ స్థానంలో ఉన్నాయి. ఫోర్బ్ జాబితాలో అమెరికా నుంచి 586 కంపెనీలు, చైనా నుంచి 249 సంస్థలు స్థానం పొందాయి. జపాన్ నుంచి టయోటా మోటార్ మాత్రమే టాప్-10లో స్థానం దక్కించుకుంది.