పాక్‌కు బుద్ధి చెప్పండి: ఆంటోనీ
విపక్షాల డిమాండ్.. ఉభయ సభలను కుదిపేసిన పాక్ దుశ్చర్య
సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులొచ్చారని రక్షణ మంత్రి ఆంటోనీ ప్రకటన
మండిపడిన ప్రతిపక్షాలు.. పాక్‌కు తప్పించుకునే మార్గం చూపుతున్నారని ధ్వజం
పాక్ కాలుదువ్వుతున్నా ప్రభుత్వం స్పందించదేమని నిలదీత
సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత సైనికులను పాక్ దళాలు కాల్చి చంపిన ఘటన మంగళవారం పార్లమెంటులోని ఉభయసభలను కుదిపేసింది. ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ‘‘పాకిస్థాన్ పదే పదే కాలు దువ్వుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?’’ అని బీజేపీ, లెఫ్ట్, ఎస్పీ, జేడీయూ, శివసేన, బీఎస్పీ ఉభయసభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీశాయి.
సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులొచ్చారు: ఆంటోనీ
లోక్‌సభ, రాజ్యసభల్లో రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తూ.. పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్ సైనికుల యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులతో కలిసి ఈ దాడి చేశారని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు పార్టీలకతీతంగా మండిపడ్డాయి. పాకిస్థాన్ సరిహద్దు యాక్షన్ టీమ్ నేతృత్వంలోనే దాడి జరిగిందని స్వయంగా రక్షణ శాఖ ప్రతినిధి ఆచార్య ప్రకటిస్తే.. పాకిస్థాన్ సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులే దాడి చేశారని చెప్పడమేంటంటూ నిలదీశాయి. పాకిస్థాన్ తప్పించుకోవడానికి ఆంటోనీ మార్గం చూపుతున్నారని విమర్శించాయి. బీజేపీ నాయకులు యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. పాకిస్థాన్ విషయంలో అసలు కఠినంగా వ్యవహరించే ఉద్దేశం కాంగ్రెస్‌కు ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. దాడి చేసేసి, అది ప్రభుత్వేతర శక్తుల కుట్రేనని తప్పించుకుంటున్న పాకిస్థాన్‌కు ఆంటోనీ వ్యాఖ్యలు మద్దతిస్తున్నట్లుందని విమర్శించారు. వామపక్షాలు, అన్నా డీఎంకే, బీఎస్పీ సహా పలువురు నేతలు ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆంటోనీ మాట్లాడుతూ.. ‘‘నియంత్రణ రేఖ వెంబడి భారత ప్రయోజనాలను కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకునేందుకు మన సైన్యం పూర్తిస్థాయిలో సమాయత్తమై ఉంది’’ అని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.
అయితే తనకు అందిన సమాచారం వరకు ఉగ్రవాదులు దాడి చేశారనే తెలుసని, పూర్తి సమాచారం అందేవరకు ఒక నిర్ణయానికి రాకూడదని పేర్కొన్నారు. పాక్ చర్యలను బట్టే భారత స్పందన ఆధారపడి ఉంటుందన్నారు. దౌత్య మార్గంలో పాక్‌కు భారత నిరసన తెలిపామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాల్పుల విరమణ ఉల్లంఘనలు రెట్టింపయ్యాయని చెప్పారు. గతేడాది జనవరి-ఆగస్టు మధ్య 57 ఉల్లంఘనలు ఉంటే.. ఈ ఏడాది అవి 80 శాతం పెరిగాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ మాట్లాడుతూ.. పాక్, చైనా చొరబాట్లను అరికట్టే విషయంలో భారత వైఖరిపై అనుమానం వ్యక్తంచేశారు. పాక్‌నుగాని, చైనానుగాని ఎట్టిపరిస్థితుల్లో నమ్మరాదన్నారు.
సోనియా విచారం..
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇలాంటి మోసకారి దాడులకు భారత్ తలవంచరాదని, ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీతోపాటు యావత్ దేశమంతా తోడుగా ఉంటుందని అన్నారు. పాక్ విషయంలో ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కోరినట్లు పార్టీ ప్రతినిధి భక్త చరణ్ దాస్ తెలిపారు. మరోవైపు ‘‘సైనికులపై దాడి జరిగిన విషయం ఉదయాన్నే తెలిసిం ది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇలాంటి సంఘటనలు రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు పునరావృతం కావడానికి దోహదం చేయవు’’ అని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.